యర్రగొండపాలెం: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు బుధవారం మోటారు బైక్‌లపై ర్యాలీగా స్థానిక మార్కాపురం రోడ్‌లోని బొప్పాయి తోట వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో కనీస ధర లభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి బొప్పాయి, అరటి, బత్తాయి, నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పు తీరే మార్గం కానరాక సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకుడికి రైతుల బాధలు ఏమీ పట్టవని, కేవలం ఆయనకు కావలసింది ఎలక్షన్లు, కలెక్షన్లేనని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధరలు, అకాల వర్షాలతో పంట నష్టం గురించి కనీస ప్రస్తావన చేయకపోవడం కలెక్షన్ బాబు నైజానికి నిదర్శనమన్నారు. అధికారులు సైతం కలెక్షన్ బాబుకు కొమ్ముకాస్తూ ప్రజల కష్టాలను పట్టించుకోవడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తే రైతుల కష్టాలు, ప్రజల బాధలు తెలుస్తాయన్నారు.
బాబు ప్రభుత్వాన్ని నిలదీద్దాం
వ్యవసాయాధారిత రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా దిశగా తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడంతోపాటు రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసి కష్టాలపాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.24 వేల ధర పలకగా.. బాబు గద్దెనెక్కిన తర్వాత రూ.9 వేలకు పడిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్యాస్ కొరత వల్ల డ్రయ్యర్లు పనిచేయక ఎక్కడిక్కడ పంట ఉత్పత్తులను రోడ్లపై ఆరబోసుకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కమర్షియల్ డీజిల్ ధర పెరగడం వల్ల రైతులపై పెట్టుబడి భారం పెరిగిపోయిందన్నారు. పల్లెల్లో తాగునీటి కష్టాలను తీర్చలేని దుస్థితిలో చంద్రబాబు సర్కారు ఉండటం ప్రజల ధౌర్భాగ్యమన్నారు. వైఎస్ జగన్ పాలనలో మాదిరిగా రైతులకు మద్దతు ధర, పరిహారం అందించకుంటే కలెక్టరేట్‌తోపాటు వ్యవసాయ, అనుబంధ విభాగాల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముందుగా ఉద్యాన శాఖాధికారి పి.ఆదిరెడ్డికి అకాల వర్షాలతో బొప్పాయి రైతులకు కలిగిన నష్టం గురించి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వై.వెంకటేశ్వరరెడ్డి, కె.ఓబులరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, పి.కృష్ణారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సయ్యద్ జబీవుల్లా, షేక్.మహమ్మద్ కాశిం, ఒంగోలు సుబ్బారెడ్డి, చిట్టె వెంకటేశ్వరెడ్డి, వెన్నా రమణారెడ్డి, వాగ్యా నాయక్, ఎల్.రాములు, సింగా ప్రసాద్, ఆవుల వీర కోటిరెడ్డి, ఆవుల రమణారెడ్డి, పి.రాములు నాయక్, తిరుమలరెడ్డి చిన్న వీరారెడ్డి, రాగాల వెంకటయ్య, సురేష్ నాయక్, సరళ, శార, అరుణాబాయి, జి.బాలకోటిరెడ్డి, షేక్.మునాఫ్ పాల్గొన్నారు.
పంటలకు గిట్టుబాటు ధర లేదు.. నష్ట పరిహారం ఊసు అసలే లేదు
దెబ్బతిన్న బొప్పాయి తోట వద్ద నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి
పొలాల బాట పట్టిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు


