హోంగార్డు ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఇంట్లో చోరీ

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

హోంగార్డు ఇంట్లో చోరీ ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

గిద్దలూరు రూరల్‌: పట్టణంలోని నంద్యాల రోడ్డులో టిడ్కో గృహాల సమీపంలో గల జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న హోంగార్డు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అందిన వివరాల ప్రకారం.. ఆవుల కాశయ్య అనే హోంగార్డు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం కలసపాడులో బంధువుల వివాహానికి వెళ్లాడు. ఇంటికి తాళాలు వేసి వెళ్లగా, దుండగులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా బద్దలుగొట్టి అందులోని రెండు జతలు బంగారు కమ్మలు, రెండు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీ చేశారు. సుమారు రూ.2 లక్షల విలువ గల ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చీమకుర్తి రూరల్‌: మండలంలోని కూనంనేనివారిపాలెం పరిధిలోని బావిలో ప్రమాదవశాత్తూ పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. చీమకుర్తికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు (65) అటువైపుగా వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది.

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఆర్‌బీ, అసిస్టెంట్‌ లోకో పైలెట్‌, గ్రూప్‌–డీ పరీక్షలతో పాటు ఏపీ హైకోర్టులో ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి ఎస్‌.నిర్మలాజ్యోతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, అర్హులైన కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌, ఒంగోలు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 100 మంది అభ్యర్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి స్టడీ మెటీరియల్‌ కూడా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అక్నాలడ్జెమెంట్‌ ఫొటోస్టాట్‌ కాపీలను జతపరచాలన్నారు. వాటితో పాటు 2 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను కార్యాలయంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయం నంబర్లు 08592–231232, 9989285530ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement