పెద్దారవీడు: మండల కేంద్రమైన పెద్దారవీడులో ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన బుధవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత అర్ధవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన ఔకు నాగేశ్వరరావు మద్యం మత్తులో ఆంజనేయస్వామి ఆలయం తలుపు పగలగొట్టాడు. హుండీ పగలగొట్టేందుకు వీలుపడకపోవడంతో గర్భగుడిలోని బీరువా తెరిచేందుకు పూనుకున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన వ్యక్తి మంచి నీటి సరఫరా మోటారు ఆపేందుకు వెళ్తూ.. ఆలయంలో శబ్దాలు రావడాన్ని గమనించాడు. గ్రామస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో అందరూ చుట్టుముట్టి దొంగను పట్టుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన జేబులో ఉన్న రూ.1600 చూపించాడని స్థానికులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై సైదుబాబు చెప్పారు.
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: వేసవి వడగాల్పులను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు సూచించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో తరచూ మంచినీరు తాగాలని, డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. బుధవారం ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ వెల్ఫేర్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వడదెబ్బ తగలకుండా ఓఆర్‌ఎస్, నిమ్మ రసం, మజ్జిగ లాంటి ద్రవాలు తాగాలని చెప్పారు. సమ్మర్ కిట్‌లో ఎండ తీవ్రత నుంచి కాపాడే టోపీలు, సన్ గ్లాసెస్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు సమ్మర్ కిట్లను క్రమం తప్పకుండా వినియోగించాలని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, ట్రాఫిక్ ఎస్సైలు కోటయ్య, శివ ప్రసాద్, మాల్యాద్రి పాల్గొన్నారు.


