న్యూస్‌రీల్
అత్తెసరు నిధులతో పనులు నత్తనడకన.. ఇంకా కావాల్సిన బడ్జెట్ రూ.2,540 కోట్లు నిర్వాసితులకు ఇవ్వాల్సింది రూ.900 కోట్లు జూలైలో వెలిగొండ నీరు పారేనా..! 7 నెలల్లో ఎనిమిది సార్లు మంత్రి నిమ్మల పర్యటన వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం మరోమారు రాక
కరువు నేలకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. గోరంత నిధులు విదిల్చి కొండంత ప్రచారాన్ని చేస్తోంది. వెలిగొండకు అన్యాయం చేసే ఊరుకోమని, ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు మంగళవారం ప్రాజెక్టును సందర్శించి నానా హంగామా చేశారు. రాత్రంతా టన్నెల్‌లో తిరిగి హడావుడి చేశారు. ఇంతవరకూ పునరావాస ప్యాకేజీని ఇవ్వకుండా పదే పదే ప్రాజెక్టు ప్రారంభంపై ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.
పారని నిధులు..
మార్కాపురం:
జూలై కల్లా వెలిగొండ నీటిని పారిస్తాం..
కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం..
మేమే శంకుస్థాపన చేశాం..
మేమే ప్రారంభిస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడు తరచుగా చెప్పే మాటలు ఇవి. చెప్పే మాటలకు, చేతలకు అసలు పొంతన ఉండదని మరోసారి నిరూపించుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సైతం ప్రాజెక్టును తరుచూ సందర్శిస్తూ చేస్తున్న హడావుడి అంతా ఇంతాకాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాకు వచ్చారు. రూ.456 కోట్ల వ్యయంతో దోర్నాల మండలంలోని గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ లైనింగు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా నిర్వహించిన సభలో ఈ ఏడాది జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తిచేసి నీరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఫీడర్ కెనాల్ పనులు మాత్రం నత్తతో పోటీ పడుతున్నాయి.
మంత్రి హడావుడి ఇలా..
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు హంగామా చేస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి మంగళవారం వరకూ ఎనిమిది సార్లు పర్యటించారు. గతేడాది నవంబరు 7న, నవంబరు 12న, డిసెంబరు 12, ఈ ఏడాది జనవరి 23న, ఫిబ్రవరి 25న, ఏప్రిల్ 7న, మే 5,6 తేదీల్లో మంత్రి రామానాయుడు వెలిగొండ టన్నెల్ పనులను పరిశీలించారు. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. జూలైనాటికి వెలిగొండ నీళ్లు ఇస్తారా అంటే.. ఇస్తామంటారు.. ఎలా అంటే చెప్పరు.. ఇదిలా ఉండగా సోమవారం మార్కాపురం పట్టణంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించింది. సభకు హాజరైన వారంతా వెలిగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ప్రభుత్వ తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నాయకులు హెచ్చరించారు. దీంతో మంత్రి రామానాయుడు హడావుడిగా మంగళవారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. పనుల పురోగతిని సమీక్షించారు. పనులు వేగంగా జరగడం లేదంటూనే రాత్రంగా టన్నెల్లో తిరుగుతూ హడావుడి చేశారు.
పరిహారం ఊసే లేదు...
వెలిగొండ నీరు టన్నెల్స్ నుంచి సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌కు చేరాలంటే 11 ముంపు గ్రామాల్లోని 7270 కుటుంబాలకు సుమారు రూ.950 కోట్ల పరిహారాన్ని చెల్లించాలి. ఇదే సమయంలో నిర్వాసితుల కోసం కడుతున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో పక్కా గృహాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. ఇవేమీ లేకుండా జూన్ నాటికి టన్నెల్ పనులు పూర్తిచేసి నీటిని విడుదల చేస్తామనే హామీ ఎలా అమలవుతుందో అర్థంకాక అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు, ముంపు గ్రామాల నిర్వాసితులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించినా ఇవన్నీ పూర్తికావాలంటే కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. మంత్రి చెబుతున్న హామీ ప్రకారం వచ్చే నెలాఖరుకు టన్నెల్స్ పనులు పూర్తయి జూలైకి నీరు రావాలి. టన్నెల్–1లో సుమారు 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. టన్నెల్–2 లో 12వ కిలోమీటరు వద్ద టీబీఎం మిషన్ ఇరుక్కుపోయి ఉంది. దాన్ని తొలగించాలన్నా చాలా సమయం పడుతుంది.
కావాల్సింది రూ.2540 కోట్లు.. ఇచ్చింది రూ.412 కోట్లు
మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.9081 కోట్ల నిధులు కావాలి. ఇప్పటి వరకూ రూ.5451 కోట్లు ఖర్చుచేశారు. భూ సేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.2540 కోట్లు కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించారు. హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్, వింగ్స్‌కు సంబంధించిన పనులు టన్నెల్ 2లో సుమారు 2400 మీటర్ల లైనింగు పనులు పూర్తి కావాల్సి ఉంది. ఫీడర్ కెనాల్‌లో 5.3 కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ కాంక్రీట్ నిర్మాణం చేశారు. 20 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ లైనింగులో 5 శాతం మాత్రమే పూర్తయింది. రెండు రోజుల క్రితమే టీబీఎం మిషన్‌ను తొలగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. టీబీఎం తొలగిస్తేనే నీళ్లు బయటకు వస్తాయి. టన్నెల్–2లో కొన్నిచోట్ల బండరాళ్లు ఊడిపడుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అటు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టక, ఇటు పరిహారం ఇవ్వక, మరో వైపు పనులు పూర్తికాక ఇలా.. సమస్యల నడుమ జూలై నాటికి వెలిగొండ నీళ్లు ఇస్తామంటున్నారు. అది ఎలా సాధ్యమో దేవుడికే తెలియాలి.


