మార్కాపురం జిల్లాలో రెవెన్యూ సమస్యలే అధికం పరిష్కారానికి నోచుకోని రెవెన్యూ అర్జీలు వన్ మంత్ వన్ విలేజ్–ఫోర్ విజిట్స్‌లో పరిష్కారానికి నోచుకునేనా ?
కలెక్టర్ వెల్లడి
మార్కాపురం టౌన్: కలెక్టరేట్ అయినా, గ్రామ స్థాయి అయినా ఎక్కడ సమావేశం పెట్టినా వచ్చే అర్జీలు రెవెన్యూవే. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థంకాక రైతులు ప్రతి సోమవారం తమ రెవెన్యూ సమస్యలపై అర్జీలు ఇస్తున్నా అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారమవుతున్నాయి. దీంతో వీటి పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి వన్ మంత్ వన్ విలేజ్–4 విజిట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో వరుసగా నాలుగు వారాలపాటు నాలుగు విడతలుగా ప్రత్యేక గ్రామ సదస్సులు నిర్వహిస్తారు. గ్రామస్థుల భూ, రెవెన్యూ సమస్యలపై అర్జీలను గ్రామంలోనే స్వీకరించి, పరిశీలించి, చట్టబద్ధంగా పరిష్కరించడం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా రీసర్వే గ్రామాలు, ఎక్కువ సంఖ్యలో పెండింగ్, రెవెన్యూ ఫిర్యాదులు ఉన్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ సదస్సుల్లో తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, రెవెన్యూ ఇన్‌స్పెక్టరు తదితర అధికారులు హాజరవుతారు. వీటిలోనైనా ఏమేరకు సమస్యలు పరిష్కారం అవుతాయో వేచి చూడాల్సిందే.
గతంలో రెవెన్యూ సమస్యలు మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారానికి నోచుకోకపోతే ఒంగోలులోని కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీలు ఇచ్చేవారు. అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటుతో ఇక్కడి కలెక్టరేట్‌లోనే అర్జీలు ఇస్తున్నారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ రెవెన్యూ సమస్యలపై వేలల్లో అర్జీలు వచ్చాయి. దీంతో రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ ఎం విజయసునీత మొదటి ప్రాధాన్యతగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రతి సోమవారం ఒకే సమస్యపై అర్జీలను ఇస్తుండటంతో వీటికి పరిష్కారమార్గం ఎక్కడ దొరుకుతుందో అర్థంకాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మ్యుటేషన్, ఆన్‌లైన్, భూ ఆక్రమణలు, పొలం తగాదా సమస్యలు వస్తున్నాయి. జనవరి నుంచి మే మొదటి వారం వరకూ మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో మొత్తం సుమారు 2308 అర్జీలు రాగా అందులో రెవెన్యూ సమస్యల అర్జీలే సుమారు 1108 ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు మాత్రం చూస్తాం.. చేస్తాం.. అంటున్నారు. రైతులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడమే తప్ప సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ప్రతినెలా ఒక గ్రామం.. నాలుగు రెవెన్యూ సదస్సులు
మార్కాపురం టౌన్: జిల్లాలో రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించేందుకు వన్ మంత్.. వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం విజయసునీత బుధవారం తెలిపారు. ఆమేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలంలో ప్రతి నెలా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు వారాల పాటు నాలుగు విడతలుగా రెవెన్యూ గ్రామ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఆ గ్రామానికి సంబంధించిన భూములు, రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామంలోనే స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. ఎక్కువ రెవెన్యూ ఫిర్యాదులు వస్తున్న గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. తహశీల్దార్, ఎంపీడీఓ, మండల సర్వేయరు, ఆర్‌ఐ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. భూ సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్, కుటుంబ భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రీసర్వే సమస్యలు, 22ఏ నిషేధిత ఆస్తుల వివరాలు, దారుల వివాదాలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో ప్రారంభిస్తామని తెలిపారు.


