స్నేహపూర్వక వాతావరణంతోనే కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

స్నేహపూర్వక వాతావరణంతోనే కేసుల పరిష్కారం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

హైకోర్టు జడ్జి కే మన్మథరావు

సింగరాయకొండ: లాయర్‌కు, జడ్జికి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పుడే కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కర్ణాటక హైకోర్టు జడ్జి కే మన్మథరావు అన్నారు. స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మొదటి వార్షికోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జడ్జి మన్మథరావు మాట్లాడుతూ న్యాయవాదిగా పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తిగా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నానని, తాను కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2 నెలల్లో 234 కేసులు పరిష్కరించానన్నారు. నేడు న్యాయవాది ఆలోచనలో మార్పులు రావాలని, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను 31 సంవత్సరాలు న్యాయవాదిగా ఉన్నప్పుడు స్థానికంగా కోర్టు ఉండాలని కలలు కన్నానని, తాను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి అయ్యాక ఆ కలను సాకారం చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కందుకూరుకు రెండు అదనపు కోర్టులు మంజూరయ్యాయని, వాటిలో ఒక కోర్టు సింగరాయకొండకు తీసుకుని రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ వీ లీలా శ్యాంసుందరి మాట్లాడుతూ తాను పనిచేసిన కోర్టుల్లో అత్యధిక కేసులు ఈ కోర్టులోనే ఉన్నాయన్నారు. తాను మూడు లోక్‌అదాలత్‌లలో సుమారు 1,350 కేసులు పరిష్కరించానని, సాధారణ కేసులు దాదాపు 1,500లకు పైగా పరిష్కరించానని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మన్మథరావును, జూనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ వీ లీలా శ్యాంసుందరిని ప్రత్యేకంగా అడ్వకేట్‌లు సత్కరించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ శ్రీనివాసులు, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డు భాస్కరరావు, చావలి రమేష్‌బాబు, లాయర్లు రాయి రమేష్‌, కె నరశింహారావు, బక్కముంతల వెంకటేశ్వర్లు, సీఐ పీ శ్రీహరి, ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, బీ మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement