ఓర్వలేక..వికృత చేష్టలు | - | Sakshi
Sakshi News home page

ఓర్వలేక..వికృత చేష్టలు

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

వైఎస్సార్‌ సీపీ కార్యకర్త గృహ ప్రవేశానికి టీడీపీ అడ్డంకులు గ్రామ సెక్రటరీతో ఇంటి ముందు గుంతలు తీయించి వికృతానందం

టంగుటూరు: టీడీపీ నాయకుల దాష్టీకాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో విర్రవీగుతున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు కొత్తగా ఇళ్లు నిర్మించుకున్నా ఓర్వలేకపోతున్నారు. టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సానుభూతిపరునిగా ఉన్న కంకణాల శ్రీను ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నాడు. దాన్ని కూడా ఓర్వలేని గ్రామ టీడీపీ నాయకులు తమ అక్కసు ప్రదర్శించారు. గ్రామ సచివాలయ అధికారులైన సెక్రటరీ, మహిళా పోలీసులను పంపించి కంకణాల శ్రీను కుటుంబానికి చెందిన సొంత స్థలంలోకి ప్రవేశించి ఇంటి గేటు ముందు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కాలువ తీసే నెపంతో మూడు సార్లు అక్రమంగా తవ్వకాలు జరిపారు. గృహప్రవేశ కార్యక్రమం నేపథ్యంలో గేటు ముందు రోడ్డును తవ్వేసి వికృతానందం పొందారు. టీడీపీకే చెందిన వేజండ్ల శ్రీను అనే వ్యక్తిని పంపించి ఈ స్థలం నాదేనంటూ పనులకు అడుగడుగునా ఆటంకం కల్పించారు. ఇది మా సొంత స్థలమని ఇంటి డాక్యుమెంట్లు చూపించినా అధికారులు పట్టించుకోకుండా గ్రామ సెక్రటరీ తవ్వకాలు చేయించి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారు. టీడీపీ సానుభూతిపరుడు వేజండ్ల శ్రీనుకు ఈ స్థలంతో ఏమాత్రం సంబంధం లేదని ఆయన వద్దనున్న ఇంటి డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నా, సెక్రటరీ మాత్రం అతడికే వత్తాసు పలుకుతున్నాడు. గ్రామ సెక్రటరీ టీడీపీ కార్యకర్తలా మితిమీరి జోక్యం చేసుకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement