సాక్షి కథనంతో హడావుడిగా లైసెన్సులు జారీ...
న్యూస్‌రీల్
అక్రమ మద్యాన్ని అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికారులు తన జేబులు నింపుకుంటూ
విక్రయదారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంతైనా అమ్ముకోండి ప్రతి వారం మామూళ్లు పక్కాగా
ఇచ్చుకోండి అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారన్న
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉన్నతాధికారి
తన చేతికి మట్టి అంటకుండా కిందిస్థాయి సిబ్బంది
ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు
ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ పే వసూళ్ల దందా
జరుగుతోందంటూ ఆబ్కారీ ఉద్యోగులు చెవులు
కొరుక్కుంటున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టిన నవోదయ కార్యక్రమానికి సంబంధించిన
బిల్లుల్లో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు
ప్రచారం జరుగుతోంది. పర్మిట్ రూములకు
సంబంధించి సాక్షిలో కథనం రావడంతో
పాత తేదీలతో హడావుడిగా లైసెన్స్‌లు
జారీ చేసినట్టు తెలిసింది.
కిక్కు అధరహో!
సాక్షి టాస్క్‌ఫోర్స్:
జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్‌లు అన్నీ అధికార పార్టీ కీలక నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. అధికారం చేతిలో ఉండడంతో మద్యం దుకాణాల్లో బహిరంగంగానే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పక్కా ప్లాన్ ప్రకారం మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం అధికార పార్టీ కీలక నాయకులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లలో మాత్రమే అవి అందుబాటులో ఉండేలా చేస్తున్నారని తెలుస్తోంది. బ్రాండెడ్ మద్యం కోసం దుకాణాలకు వెళ్లిన మద్యం ప్రియుల సరుకు దొరకడంలేదు. ఫలానా బార్‌కు వెళ్లండి అక్కడ దొరుకుతుందని మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందే సలహా ఇస్తున్నారని తెలిసింది. అక్కడకు వెళితే రూ.50 నుంచి రూ.300 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీ ప్రకారం మద్యం విక్రయించేలా చూడాల్సిన ఎకై ్సజ్ శాఖ కీలక అధికారి మామూళ్ల మత్తులో ఇటువైపు తొంగిచూడడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కీలక అధికారి పర్యవేక్షణలో ఒక టాస్క్‌ఫోర్స్ టీం పనిచేస్తుంది. ఇందులో ఒక ఏఈఎస్, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 10 నుంచి 15 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తుంటారు. ఈ టీం జిల్లాలోని మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయించకుండా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎమ్మార్పీకి మించి మద్యాన్ని విక్రయిస్తుంటే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అయితే ఈఎస్ టీం ఇప్పటి వరకు కనీసం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనిఖీలను గాలికి వదిలేసి కేవలం లంచాలు వసూలు చేసేందుకే ఆ బృందం పనిచేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా విజయవాడ నుంచి వచ్చిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ టీం మాత్రం 4 కేసులు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర బృందం గుర్తించిన అక్రమాలను జిల్లా బృందం గుర్తించకపోవడంపై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
నవోదయం’ బిల్లులు కై ంకర్యం...
నిన్నా మొన్నటి వరకు మద్యం దుకాణాలకు పర్మిట్ లైసెన్స్ మంజూరు చేయకుండా ముడుపుల కోసం ఫైళ్లను పెండింగ్ పెట్టిన కీలక అధికారి మంగళవారం సీఐలతో సమావేశం ఏర్పాటు చేసి హడావుడిగా లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. పర్మిట్ రూములకు సబంధించి సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో సదరు అధికారి హడావుడిగా అధికారులతో సమావేశమైనట్టు తెలిసింది. గత అక్టోబర్ నెలలో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో లైసెన్సు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ మార్చిలో లైసెన్సులు మంజూరు చేసి వుంటే గత 5 నెలలుగా పర్మిట్ రూంలు అనధికారికంగా నిర్వహించినట్లు కీలక అధికారి ఒప్పుకున్నట్లే కదాని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. పైసల కోసం పర్మిట్ రూంలకు లైసెన్సులను జారీ చేయకుండా పెండింగ్ పెట్టడం ఒక తప్పయితే మార్చిలో లైసెన్స్ జారీ చేసినట్లు తప్పుడు తేదీలతో లైసెన్సులు జారీ చేయడం మరో తప్పన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఎమ్మార్పీకన్నా అధికంగా మద్యం విక్రయాలు
కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న ఈఎస్ టీం
4 కేసులు నమోదు చేసిన స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందం
నెలవారీ మామూళ్ల మత్తులో అధికారులు
సాక్షి కథనంతో పాత తేదీలతో హడావుడిగా పర్మిట్ రూమ్‌లకు లైసెన్స్‌ల జారీ
నవోదయ 2.0 నిధులు మింగేసినట్టు ఆరోపణలు
కానిస్టేబుల్‌తో ఫోన్‌పే ద్వారా వసూళ్లు
నాటుసారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ‘నవోదయం 2.0’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 9 ఎకై ్సజ్ సర్కిల్ స్టేషన్లలో భారీ ఎత్తున నాటుసారా వ్యతిరేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. నాటు సారా ప్రభావిత ప్రాంతాలైన యర్రగొండపాలెం, మార్కాపురం, దోర్నాల, పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు తదితర మండలాల్లో విస్తృతంగా నాటుసారా వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రచార రథాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎకై ్సజ్, ఫారెస్ట్, పోలీసు, పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను సమన్వయం చేసుకొని ప్రచారం చేశారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఎకై ్సజ్ సీఐలకు రూ.17 లక్షలు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌కు రూ.4 లక్షల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల నుంచి పోలీసు స్టేషన్ స్థాయిని బట్టి, వారు నిర్వహించిన కార్యక్రమాల ఆధారంగా నిధులను కేటాయించాల్సి ఉంది. అదేవిధంగా సీఐలకు నిధులు కేటాయించిన కీలక అధికారి వారి నుంచి 50 శాతం ముడుపులను బలవంతంగా వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ముడుపులను తన టీంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌కు ఫోన్ పే చేయించుకున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని విచారిస్తే అసలు గుట్టు రట్టవుతుందని క్షేత్రస్థాయి ఉద్యోగులు చెబుతున్నారు. 50 శాతం కమీషన్ వసూలుపై కొందరు సీఐలు భగ్గుమంటున్నారని తెలిసింది. అంతటితో ఆగకుండా గత ఈఎస్ కోసం మంజూరైన రూ.4 లక్షలను నిబంధనల ప్రకారం ఆయనకు చెల్లించకుండా గుట్టుచప్పుడు కాకుండా కీలక అధికారి నొక్కేసినట్లు విశ్వసనీయ సమాచారం. కీలక అధికారి వసూళ్లపై కొందరు ఉద్యోగులు మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.


