ఇసుకాసురుల విధ్వంసకాండ | - | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల విధ్వంసకాండ

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పాలేరు నదిని తొలిచేస్తున్న టీడీపీ నేతలు

జోరుగా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా

ధ్వంసమవుతున్న రోడ్లు

అవస్థలు పడుతున్న ప్రజలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అధికార పార్టీ నేతలు పాలేరు నదిని కుళ్లబొడిచేస్తున్నారు. రేయింబవళ్లు భారీ వాహనాలతో తవ్వకాలు చేస్తూ నదీ గర్భాన్ని తొలిచేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు నది పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో ప్రవహిస్తోంది. పాలేరు నది పరివాహక ప్రాంతాల్లో జేసీబీల ద్వారా ఇసుకను టిప్పర్లకు తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా రెండు, మూడు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వాహనాలను చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి, పొదిలి వైపు ఇసుక టిప్పర్లను తరలిస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ఇసుకను టిప్పర్ల ద్వారా బహిరంగంగానే రవాణా చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక వ్యాపారుల దందాకు అడ్డేలేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌ సమీక్షిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుపడడం లేదు.

ధ్వంసమవుతున్న రోడ్లు:

అధిక లోడుతో లారీలు కామేపల్లి నుంచి కొండపి వైపు వెళ్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కామేపల్లి– నేతివారిపాలెం మధ్య రోడ్డు ధ్వంసమైంది. కొండపి–అనకర్లపూడి మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొండపి, పెరిదేపి గ్రామాల మధ్య కూడా రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

టన్ను ఇసుకను రూ.900 నుంచి రూ.1100 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని లారీలు ఆరు టన్నుల నుంచి 12 టన్నులు వరకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాయి. కొండపి మీదగా దాదాపు రోజుకు సుమారుగా 50 లారీల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది.ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు బొక్కేస్తున్నారు.

పట్టపగలు ఇసుక తరలిస్తున్న టిప్పర్‌

Advertisement
 
Advertisement
Advertisement