తీగలేరు కాలువకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

తీగలేరు కాలువకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలంలో తాగు, సాగునీరు అందించే తీగలేరు(టీ–5) కాలువకు చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలు పలికిందని ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలుదఫాలుగా వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించడమే పనిగా పెట్టుకున్నారని, టీ–5 కాలువ ఆ ప్రాజెక్ట్‌లో అంతర్‌ భాగమేనన్న విషయాన్ని ఆయన మరిచిపోయినట్లుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మంత్రి చూపు ఆ కాలువ వైపు వెళ్లనట్లుందని, నేటికీ భూ సేకరణ, టెండర్‌ ప్రక్రియ మొదలు కాలేదన్నారు. దశాబ్దాల తరబడి పుల్లలచెరువు మండల ప్రజలు తాగునీటి కోసం అలమటించి పోతున్నారని, సాగు నీటి సమస్యతో రైతులు వ్యవసాయం చేయలేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, టీ–5 కాలువతోనే ఈ సమస్యలు పరిష్కరించవచ్చన్న విషయాన్ని పక్కకు పెట్టినట్లుందని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ కాలంలో మండలంలో నెలకొన్న నీటి సమస్యను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆ కాలువకు రూ.83 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని ఆయన గుర్తుచేశారు. మండల ప్రజల తాగునీటితోపాటు దాదాపు 11 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని, యర్రగొండపాలెం ప్రాంతంలో భూగర్భ జలాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం టీ–5పై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలు అర్థం చేసుకొని తక్షణమే కాలువ పనులు ప్రారంభించాలని తాటిపర్తి డిమాండ్‌ చేశారు. లేకుంటే కాలువ కోసం ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement