● రైతు సంఘం డిమాండ్
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రైతు సమితి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని, క్వింటాకు రూ.2400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మార్కాపురం జాయింట్ కలెక్టర్, డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘ జిల్లా కన్వీనర్ దేవండ్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కార్యదర్శి పీ కొండయ్య, సీపీఐ నాయకులు అందె నాసరయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి కాసీం, నాయకులు శంకరరావు, నాగయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేవండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. మార్చి చివరి నుంచే పంట దిగుబడులు మార్కెట్లోకి వస్తున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం అమలు విషయంలో ఆలస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోతున్నారని, వ్యాపారులకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మొక్కజొన్నకు పూర్తి మద్దతు ధర చెల్లించాలన్నారు. ఇప్పటికే తక్కువ ధరలకు అమ్ముకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మేరకు వ్యాపారులు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


