మంత్రి చెప్పారు.. బోరు పీకారు! | - | Sakshi
Sakshi News home page

మంత్రి చెప్పారు.. బోరు పీకారు!

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

పొన్నలూరు:

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ తెలుగు తమ్ముళ్ల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తాము ఏమి చేసిన అడిగేవారు లేరంటూ అధికార మదంతో సామాన్య ప్రజలు, రైతులపైనా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. రైతులు వినియోగించుకుంటున్న డీప్‌బోర్‌ ప్రభుత్వం వేసిందని సాకుగా చూపి రెండేళ్లుగా వేధిస్తున్న పచ్చ నేతలు.. మంత్రి అండతో నిర్ధాక్షిణ్యంగా మోటారు పీకేయించడం కొండపి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పొన్నలూరు మండలంలోని చెరుకూరు గ్రామంలో వ్యవసాయ రైతు నేలపాటి మాలకొండయ్యకు 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సుమారుగా 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం రోడ్డు పక్కన బోరు బావి తవ్వించి చేతిపంపు ఏర్పాటు చేసింది. కాలక్రమంలో చేతిపంపు మరమ్మతులకు గురికావడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు హెడ్‌ను తొలగించి తీసుకెళ్లారు. మట్టితో పూడిపోయిన డీప్‌బోర్‌ను మాలకొండయ్యతోపాటు మరికొందరు రైతులు కలిసి సొంత డబ్బు వెచ్చించి రీబోర్‌ చేయించారు. విద్యుత్‌ మోటారు బిగించి, విద్యుత్‌ శాఖకు రూ.1.50 లక్షలు చెల్లించి ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా ఏర్పాటు చేయించుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా ఆ డీప్‌బోరును మాలకొండయ్యతోపాటు చుట్టుపక్కల పొలాల రైతులు వినియోగించుకుంటున్నారు.

మంత్రి ఆదేశాలతో తొలగింపు..

చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన క్షణం నుంచే మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులను గ్రామ టీడీపీ నాయకులు వేధించడం ప్రారంభించారు. డీప్‌ రహదారిలో ఉందని, అది గతంలో టీడీపీ జమానాలో వేసిందని చెబుతూ బెదిరింపులకు దిగారు. దీనిని మాలకొండయ్యతోపాటు మిగిలిన రైతులంతా వ్యతిరేకించడంతో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. డీప్‌బోర్‌ తొలగించాల్సిందేనంటూ మంత్రి డీబీవీ స్వామి వద్ద పంచాయితీ పెట్టి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఆదేశాలిచ్చేలా ఒత్తిడి చేశారు. ఈ నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో పాల్గొనేందుకు మంత్రి స్వామి చెరుకూరు వస్తుండగా.. ఓ గంట ముందుగానే ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వ్యవసాయ మోటార్లు తొలగించే యంత్రం ఉపయోగించి ఆగమేఘాలపై డీప్‌బోర్‌లో ఉన్న మోటారు తొలగించి పక్కన పడేశారు. కొందరు టీడీపీ నాయకులు చేసిన పని, మంత్రి స్వామి వ్యవహరించిన తీరు గ్రామంలోని టీడీపీ సానుభూతిపరులకు కూడా నచ్చలేదు. మోటారు తొలగింపు విషయమై పింఛన్ల పంపిణీ సమయంలో మంత్రి స్వామిని నిలదీయాలని గ్రామస్తులు సిద్ధం కాగా టీడీపీకి చెందిన కొందరు నేతలు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని సర్దిచెప్పడం గమనార్హం. దీంతో బాధిత రైతులు కూడా మిన్నుకుండిపోయారు.

చెరుకూరులో రైతులపై రాజకీయ కక్ష సాధింపులు

మంత్రి స్వామి ఆదేశంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల అత్యుత్సాహం

డీప్‌బోర్‌ నుంచి మోటారు తొలగించిన వైనం

మంత్రి స్వామి, తెలుగు తమ్ముళ్ల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement