పీసీపల్లి: మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు మంగళవారం వైభవంగా సాగాయి. మంగళవారం గంగమ్మతల్లిని బొల్లావులతో అలవలపాడు, గుదేవారిపాలెం, రామాపురం గ్రామాల మీదుగా ఊరేగించారు. అనంతరం అమ్మవారిని నిధిలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. యాదవుల కులదైవమైన గంగమ్మతల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం పొంగళ్లతో తిరునాళ్ల ముగుస్తుంది. తిరునాళ్లను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మొక్కుబడులు ఉన్న వారు తిరునాళ్లకు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. తిరునాళ్లను పురస్కరించుకొని గంగమ్మ తల్లికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న కాటంరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవుల అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ నాయకులు వెంగళాపురానికి చెందిన పాతకొట్టు పిచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, బాలయ్య చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలు ఆకట్టుకున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరునాళ్లను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు.


