● చాకిరేవు కుంటను కాపాడాలని సీపీఎం డిమాండ్
ఒంగోలు టౌన్: నగరంలోని 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలులో ఉన్న చాకిరేవు కుంటలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం చాకిరేవు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 రోజులుగా కొందరు రియల్టర్లు చాకిరేవు కుంటను తవ్వి తమ వెంచర్లకు మట్టిని తోలుకుపోతున్నా అఽధికారులకు పట్టకపోవడం దారుణమన్నారు. మైనింగ్ శాఖ అఽధికారుల అనుమతి లేకుండా మట్టిని ఎలా తవ్వుకుంటారని, అయినా చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలా మిన్నకుంటారని ప్రశ్నించారు. ప్రకృతి సిద్ధమైన చెరువులు, కుంటలు, వాగులను కాపాడాల్సిన బాధ్యత అఽధికారులపై ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి సంకేతమని నిలదీశారు. కుంటను 20 అడుగుల లోతుకు తవ్వడం వల్ల భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎక్స్‌లేటర్ల ద్వారా తవ్వకాలు చేపట్టి వందలాది ట్రాక్టర్ల మట్టిని తోలుకుంటున్నారని తెలిపారు. మట్టిని తవ్వుకొని టిప్పుల లెక్కన అమ్ముకుంటున్నారని ఆరోపించారు. చాకిరేవు వద్ద పెద్ద సంఖ్యలో నిలిచి ఉన్న ట్రాక్టర్లు చీమలదండులా కనిపిస్తున్నా అధికారుల కంటికి కనిపించకపోవడం వింతగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చాకిరేవు కుంటను కాపాడాలని, కుంటను గ్రామాభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆంజనేయులు, కోటయ్య, రాఘవరావు, వెంకటరావు, జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.


