మాస్టర్‌ ప్లాన్‌ అనుమతికి అభ్యంతరాల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ ప్లాన్‌ అనుమతికి అభ్యంతరాల స్వీకరణ

May 6 2026 9:13 AM | Updated on May 6 2026 9:13 AM

జూన్‌ 3వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ

చీమకుర్తి: చీమకుర్తి మున్సిపాలిటీలో మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేందుకు రూపొందించిన వివరాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కమిషనర్‌ వై.రామకృష్ణయ్య మంగళవారం మీడియా ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు చీమకుర్తి మున్సిపల్‌ కార్యాలయం లేదా మెయిల్‌ ద్వారా అభ్యంతరాలను తెలియజేయాలని తెలిపారు. చీమకుర్తి పట్టణాన్ని రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, మిక్స్‌డ్‌, ఇండస్ట్రీ కేటగిరీలుగా విభజించినట్లు కమిషనర్‌ తెలిపారు. ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి అనుబంధంగా మున్సిపాలిటీలో మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌కు హద్దులుగా ఉత్తరం వైపు నాయుడుపాలెం, బండ్లమూడి, పల్లామల్లి, తూర్పు వైపు గురవారెడ్డిపాలెం, పేర్నమిట్ట, దక్షిణం గోనుగుంట, ఆర్‌ఎల్‌ పురం, పడమర ఆర్‌ఎల్‌ పురం, బూదవాడ గ్రామాల సరిహద్దులుగా నిర్ణయించారు. మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తే రోడ్ల ప్రాధాన్యతను బట్టి 100 అడుగుల వెడల్పు నుంచి విస్తరణ చేపట్టే అవకాశం ఉంటుదని చెప్పారు. ఇక మీదట ఎక్కడంటే అక్కడ పరిశ్రమలు పెట్టుకోవడానికి వీలు కాదని, అనుమతినిచ్చిన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీటి వ్యవస్థలో అభివృద్ధి మెరుగుగా మారుతుందని కమిషనర్‌ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement