కంభం: వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఎస్సై శివక్రిష్ణారెడ్డితో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బేస్తవారిపేట మండలం జగ్గంబొట్ల కృష్ణాపురం గ్రామానికి చెందిన భూపని సాయి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతేడాది ఆగస్టు 24న అర్ధరాత్రి పట్టణంలోని షిరిడిసాయినగర్‌లో ఓఇంట్లో బంగారు నగలు, నగదును అపహరించాడు. అదే ఏడాది నవంబర్ 28న పట్టణంలోని ఆర్టీిసీ బస్టాండ్ సమీపంలో గల దుర్గా వైన్‌షాపులో నగదు, ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన మండలంలోని నడింపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి బీరువా పగులగొట్టి బంగారు కమ్మలు, వెండి పట్టీలు దోచుకెళ్లాడు. 17వ తేదీన మండలం రావిపాడు గ్రామంలో భీమేశ్వరస్వామి ఆలయంలో గుడి తలుపులు పగులగొట్టి బంగారు తాళిబొట్టు, చిన్న ఉంగరం, వెండి పట్టీలు, 18వ తేదీన అర్ధవీడు మండలంలోని మాగుటూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయం గుడి తలుపులు పగులగొట్టి హుండీలోని సుమారు రూ.10 వేల నగదును అపహరించుకు వెళ్లాడు. పైచోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్న సమయంలో సోమవారం కంభం చెరువుకట్టకు వెళ్లే దారిలోని అంకాళమ్మ గుడి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు.
20 గ్రాముల బంగారు నగల రికవరీ..
నిందితుడి భూపని సాయి వద్ద నుంచి రూ. 2.50 లక్షలు విలువ కలిగిన 20 గ్రాముల బంగారు నగలు, 25 తులాల వెండి పట్టీలు, రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు పట్టణంలోని గణేష్‌నగర్‌లో జరిగిన ఓ చోరీలో అచ్చి చిన్నసైదారావు అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నగలు రికవరీ చేసినట్లు తెలిపారు. పై కేసులను త్వరగా ఛేదించడంలో, నిందతుడిని చాకచక్యంగా అరెస్టు చేసి దొంగిలించిన సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ కే మల్లికార్జున, ఎస్సై శివక్రిష్ణారెడ్డిని, సిబ్బంది కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, రంగస్వామిలను డీఎస్పీ అభినందించారు.


