పీసీపల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన మండల పరిధిలోని వెంగళాపురం సమీపంలో పాలేటి నది ఒడ్డున వెలసిన భగీరథ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లకు అన్నీ ఏర్పాట్లు చేశారు. సోమవారం గంగమ్మ తల్లిని రామాపురం, గుదేవారిపాలెం, అలవలపాడులో గ్రామోత్సవం నిర్వహించి మంగళవారం సాయంత్రానికి ఆలయం వద్దకు ఉత్సవ విగ్రహాన్ని తీసుకువస్తారు. ఈసందర్భంగా తిరునాళ్ల ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించి మాట్లాడారు. 250 మందితో తిరునాళ్లకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, ఒక డీఎస్పీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఎస్‌బీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరావు, కనిగిరి సీఐ శ్రీనివాసులు, పీసీపల్లి ఎస్సై నరసింహారావు, కనిగిరి ఎస్సై సందీప్, హెచ్‌ఎంపాడు ఎస్సై రాజకుమార్ ఉన్నారు. ఎంపీడీవో కృష్ణారావు, తహసీల్దార్ ఉషా, డాక్టర్ యశ్విత వైద్యశిబిరానికి ఏర్పాట్లను పరిశీలించారు.
బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన సోమవారం రాత్రి మండలంలోని పెంచికలపాడు సమీపంలో జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడుకు చెందిన యోగయ్య, మార్కాపురానికి చెందిన పీ శ్రీనులు మోటార్ సైకిల్‌పై కంభం వైపు వెళ్తున్నారు. పెంచికలపాడు సమీపంలోకి రాగానే గేదెలు అడ్డురావడంతో రెండు వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో యోగయ్య, శ్రీనులు రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో వైద్యశాలకు తరలించారు.


