డబుల్ ఇంజన్ సర్కార్‌కు ఇంజన్ ఉందా : శైలజానాథ్ వెలిగొండకు అన్యాయంపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం : కారుమూరి రాయలసీమకు ద్రోహం చేస్తున్న కూటమి ప్రభుత్వం : బూచేపల్లి వెన్నుపోటు ఘనుడు చంద్రబాబు : తాటిపర్తి రాయలసీమకు చంద్రగ్రహణం : ఆదిమూలపు సీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను పూర్తి చేయాలి : మేరుగు అమరావతిపై ఉన్న శ్రద్ధ వెలుగొండపై లేదు : వెంకాయమ్మ
వెలిగొండకు అన్యాయం చేస్తే
మార్కాపురం/మార్కాపురం టౌన్/మార్కాపురం రూరల్: తమది డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు సర్కార్‌కు అసలు ఇంజన్ ఉందా..లేదా.? అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్వీనర్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీటికై పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సోమవారం మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అధ్యక్షత వహించారు. శైలజానాఽథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై టూర్ నుంచి వచ్చిన తరువాత చంద్రబాబు ఏమైనా మాట్లాడతాడా అని ఎదురుచూస్తుంటే.. ఏమీ లేకపోగా వైఎస్సార్ సీపీ నాయకులపై వారి మంత్రులు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ఈ ప్రాంత వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టుకు బాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతి పేరుతో దోపిడీ మానుకుని వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటలు పండుతాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను అవకాశం వచ్చిన చోటల్లా చెబుతూనే, మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు.
వెలిగొండకోసం పోరాటం : బూచేపల్లి
వెలిగొండ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పోరాటం చేస్తామని దర్శి ఎమ్మెల్యే, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఆ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులు బాగుండాలంటే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. బాబు పోవాలి–జగన్ రావాలి అనే నినాదంతో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు షంషీర్ అలీబేగ్, కేవీ రమణారెడ్డి, వైవీ రావు, వెన్నా హనుమారెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, పిడతల ప్రవీణ్‌కుమార్, బి.అశోక్‌కుమార్‌రెడ్డి, బి.రామారావు, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలకు చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.


