● వై.పాలెం ఎమెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకుల వరకూ దిగజారుడు పరిస్థితుల్లో ఉన్నారని, ప్రతిపక్షానికి చెందిన వారిని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని వారు గుర్తుంచుకోవాలన్నారు. ఈ నెల 1వ తేదీ ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ నుంచి యర్రగొండపాలెం వస్తుండగా, మాచర్లలో మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి కేక్ కట్ చేయించారు. పిన్నెల్లి ఆధ్వర్యంలో అక్కడికి చేరిన ప్రజలను చూసి ఓర్వలేక మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన వర్గీయులతో సోషల్ మీడియాలో చేయిస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాటిపర్తి ఖండిచారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రజల మన్ననలతో 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి.. పక్క నియోజకవర్గంలోని దళిత ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు చేయడాన్ని కూటమి నాయకులు జీర్ణించుకోలేక విమర్శించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేను సన్మానించడాన్ని సహించలేకపోవడం ఏంటో అర్థం కావడంలేదన్నారు. పిన్నెల్లి చరిష్మా, ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేక టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి విచక్షణ కోల్పోయి సోషల్ మీడియా వ్యక్తుల వెనకుండి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నాడని తాటిపర్తి విమర్శించారు. ఈ పరిస్థితులను చూస్తుంటే.. దళిత వర్గాల పట్ల జూలకంటి ఆలోచన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందని అన్నారు. మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నాయకులు ఆవుల వీరకోటిరెడ్డి, పప్పర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు.


