న్యూస్‌రీల్
వెలుగొండ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లలో అరకొరగా నిధుల కేటాయింపు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది రూ.412 కోట్లు మాత్రమే.. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులకే వెయ్యి కోట్ల మేరకు అవసరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నత్తనడకన పునరావాస పనులు తమ త్యాగాలకు విలువ లేకుండా పోయిందంటూ ముంపు గ్రామాల ప్రజల ఆవేదన బాధితుల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో సదస్సు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శరవేగంగా అభివృద్ధి...
వెలుగొండ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేకుండా పోతోంది. ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా పరిస్థితి తయారవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లలో అరకొరగా నిధులు కేటాయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టు పరిస్థితి నెలకొంది. పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోవడంతో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ త్యాగాలకు విలువ లేకుండా పోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మార్కాపురంలో నేడు సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం...
బాబు బురిడీ..
వెలుగొండ గారడీ..!
మార్కాపురం:
నాడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మరోవైపు వచ్చే జూన్, జూలైలో వెలుగొండ ప్రాజెక్టుకు నీరిస్తామని ఇటీవల ప్రకటించారు. కాగా, పునరావాస కాలనీల్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ నీటిని విడుదల చేస్తే తమ భవిష్యత్తు ఏమిటంటూ ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడేందుకు వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, వెలుగొండ ప్రాజెక్టు పనులపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నేడు మార్కాపురంలో సదస్సు నిర్వహించనుంది.
పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష...
మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆయా కాలనీల్లో గుడి, బడి, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటర్ ట్యాంకులు, పంచాయతీ భవనాలు, సిమెంటు రోడ్లు నిర్మించారు. పలు కాలనీల్లో గృహ నిర్మాణాలకు పూనుకున్నప్పటికీ 2024లో ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనుల కోసం ముంపు గ్రామాల ప్రజలు ఆశగా ఎదురుచూశారు. కానీ, అవేమీ జరగలేదు. దీంతో తమ త్యాగానికి గుర్తింపు లేకుండా పోతోందని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో నిరాశ, నిస్తేజం అలముకున్నాయి. అయితే తరచూ రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షకు వస్తున్నప్పటికీ పునరావాస పనుల్లో మాత్రం పురోగతిలేదు. పునరావాస కాలనీల్లో పనులు చేపడతామని చెప్పినప్పటికీ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. గతేడాది మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం రోజు, ఈ ఏడాది ఫిబ్రవరి 25న మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండపై మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం పట్ల ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటే చెబుతూ.. జూన్, జూలైలో నీళ్లిస్తామనడంతో సర్వత్రా ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురవుతుండగా, వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తాతలనాటి ఊర్లను వదిలి ఇళ్లు, పొలాలను త్యాగంచేసి బయటకు వచ్చేందుకు ప్రజలు సిద్ధమవగా, వారి పట్ల ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఇళ్లు కట్టించాలని కోరుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం...
పశ్చిమ ప్రాంతంలో శాశ్వతంగా కరువు నివారించడంతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా మార్కాపురం వచ్చిన చంద్రబాబు.. తాను అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టుకు అత్యధిక నిధులు కేటాయించి త్వరగా పూర్తిచేస్తానని చెప్పారు. కానీ, గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం రూ.309.13 కోట్లు, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.412 కోట్లు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఇలా అయితే పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తిచేస్తారో అర్థం కావడం లేదని, అదే సమయంలో నీళ్లు వదిలితే తాము ఊర్లను వదిలి ఎక్కడుండాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే భావన ముంపు గ్రామాల ప్రజల్లో ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించకపోవడంతో పునరావాస కాలనీల్లో పిచ్చిచెట్లు, చిల్లచెట్లు మొలిచి పెద్దవై అరణ్యాన్ని తలపిస్తున్నాయి. విషసర్పాలు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల పునరావాస కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంటవద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. వాటిలో సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు.
పునరావాస పనులు వెంటనే ప్రారంభించాలి :
ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలి. వెలుగొండ నిర్వాసితులకు వెంటనే ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. నాటి ఒప్పందం ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.14 లక్షలతో పాటు పునరావాస కాలనీల్లో పక్కా గృహం కట్టించి ఇవ్వాలి. కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– తుమ్మా వెంకటరెడ్డి, గొట్టిపడియ, మార్కాపురం మండలం
కాలనీల్లో అభివృద్ధి ఎప్పుడు :
పునరావాస కాలనీల్లో అభివృద్ధి పనులు నత్తనడకతో పోటీపడుతున్నాయి. సుంకేశుల పునరావాసకాలనీ చిల్లచెట్లతో నిండిపోయింది. బడి, గుడి, కమ్యూనిటీ హాలు మాత్రమే కట్టగా, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు నీళ్లు వదిలితే మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పునరావాస కాలనీల్లో త్వరగా పనులు పూర్తిచేయాలి.
– జి.రమేష్, మాజీ సర్పంచ్, సుంకేశుల


