దంచికొట్టిన గాలివాన | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన గాలివాన

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో బీభత్సం ● మధ్యాహ్నం వరకు మండిపోయిన ఎండ

● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో బీభత్సం ● మధ్యాహ్నం వరకు మండిపోయిన ఎండ

ఒంగోలు సిటీ: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండ మండిపోయింది. 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురంలో 43 డిగ్రీలు, కనిగిరిలో 42, ఒంగోలులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి గాలి వీచడం ప్రారంభమైంది. క్రమంగా పెనుగాలులు వీచాయి. రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో గాలివాన దంచికొట్టింది. జనజీవనం స్తంభించేంతగా సుమారు గంటకుపైగా గాలివాన అతలాకుతలం చేసింది. సాయంత్రం వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊపిరి పీల్చుకునేలోపే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించి విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో జనం అసౌకర్యానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. మార్కాపురం జిల్లాలోని కంభంలో అరటి తోటలు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభం కుప్పకూలడంతో పాటు ఇళ్లపై రేకులు లేచి కిందపడ్డాయి. కనిగిరి నియోజకవర్గంలోనూ గాలివాన కారణంగా రేకులు, విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ గాలివాన భయానకం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గాలివానకు జనం అవస్థపడ్డారు. మెరుపులతో కూడిన ఉరుముల శబ్దాలకు నగరం దద్దరిల్లింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అసౌకర్యం తలెత్తింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది.

Advertisement
 
Advertisement
Advertisement