మంత్రి కోసం దేవుడైనా ఆగాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

మంత్రి కోసం దేవుడైనా ఆగాల్సిందే..!

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

ఆనం కోసం ఆలస్యంగా వేణుగోపాలస్వామి రథోత్సవం 2 గంటల ఆలస్యంపై భక్తుల మండిపాటు

ఉలవపాడు: సూర్యాస్తమయానికి ముందే కన్నుల పండువగా జరగాల్సిన రథోత్సవం మంత్రి, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం వలన ఏకంగా రెండు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆలస్యంగా రావడంతో చివరకు చీకట్లో రథోత్సవం జరిగింది. మండల కేంద్రమైన ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహించారు. ఉదయం రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలుని కళ్యాణం నిర్వహించారు. ఈ ఏడాది రూ.80 లక్షలతో నూతన రథం తయారు చేశారు. ట్రయల్‌ రన్‌ కూడా ఈ నెల 1న పూర్తయింది. ఈ రథం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. కార్యక్రమం పూర్తయి సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభం కావాలి. కానీ 6.30 గంటలకు మంత్రి, ఎమ్మెల్యే వచ్చారు. శిలాఫలకం ఆవిష్కరించి రథోత్సవం ప్రారంభమయ్యేసరికి 7 గంటలు దాటి చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత రథోత్సవం ప్రారంభం కావడం ఆలయ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రతి ఏడాది చీకటి పడేలోపు రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. కానీ, ఈ ఏడాది 7 గంటలకు ప్రారంభమైంది. భక్తులు దాదాపు రెండు గంటల పాటు రథం కదులుతుందని ఎదురుచూస్తూ నిలబడాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు ఏకంగా వేణుగోపాల స్వామినే కదలకుండా ఆపివేసిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు రథోత్సవానికి హాజరయ్యారు. కానీ, ఎప్పుడూ రథోత్సవాన్ని ఆలస్యం చేయలేదు. రథం తిరుగుతున్న సమయంలోనే వారు వచ్చి దర్శించుకుని వెళ్లిపోయేవారు. కానీ, ఇలా దేవుడిని ఆపడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భారీగా భక్తులు హాజరైనప్పటికీ దేవుడికి సమయానికి జరగాల్సిన ఉత్సవాన్ని ఇలా ఆలస్యం చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement