మార్కాపురం: వెలుగొండ ప్రాజెక్టుపై జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కాలేజీ రోడ్డులో ఉన్న సౌజన్య ఫంక్షన్ హాలులో సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సదస్సు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. ఈ సదస్సుకు ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, టి.మాధవరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, పార్లమెంటు కన్వీనరు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎస్.శైలజానాథ్, రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పలువురు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, నియోజకవర్గ పరిశీలకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సంఘ మండల అధ్యక్షులు, సాగునీటి సంఘ నిపుణులు, మాజీ సర్పంచ్‌లు హాజరుకావాలని కోరారు. వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాల పోరాట సమాలోచన, తాగు, సాగునీరు, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తిచేయాలనే డిమాండ్లపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు.
అన్నా రాంబాబు


