దొనకొండ:
వేసవిలో మంచి నీటి సమస్య ఉత్పన్నం కాకూడదన్న అధికారుల మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. సాగర్ జలాలు సరఫరా చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల్లో సైతం పాలకుల నిర్లక్ష్యం మూలంగా మంచినీటి కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకుండా కొర్రీలు పెట్టడంతో చందవరం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పరిధిలోని వేలాది మంది తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంపిన ప్రతిపాదనలను సైతం చంద్రబాబు సర్కారు బుట్టదాఖలు చేయడంతో గ్రామాల్లో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి.
మరమ్మతుల్లో జాప్యం
వేసవి కాలం ప్రారంభమై రెండు నెలలైంది. అంతకంటే ముందే నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉండగా క్షేత్ర స్థాయిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వంతోపాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహాల్లో బోర్లు లేని వారు తాగేందుకు, వాడుకునేందుకు నీరు లేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చందవరం రిజర్వాయర్ వద్ద మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం దొనకొండ మండల ప్రజలకు శాపంగా మారింది. చందవరం సాగర్ నీటి రిజర్వాయర్, పంప్ హౌస్, మినరల్ ఫిల్టర్లు, కొత్త మోటార్లు, పైపులైన్లు, ఇతరత్రా నిర్వహణ పనులకు రూ.2.5 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులకుగాను టెండర్ ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, బిల్లుల మంజూరులో జాప్యం వెరసి కాంట్రాక్టర్లు సగం పనులు కూడా పూర్తి చేయలేదు. దీంతో ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందు నుంచే దొనకొండ ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. దొనకొండలోని ముస్లిం బజార్, వీవీపురం, బేతేలుపురం, అరబస్తాన్, ఓబ్బాపురంలోని ప్రజలకు రెండు నెలలుగా గుక్కెడు మంచినీటి సరఫరా చేయలేదు.
ప్రత్యామ్నాయం శూన్యం
చందవరం వద్ద 855 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మొదటి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద పంపింగ్ మోటార్ల మరమ్మతులు జాప్యమయ్యే సూచనలున్నాయని అధికారులు గ్రహించినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. అవసరమైన ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి సమస్యను పరిష్కరించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, కొన్ని గ్రామాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తూ అధికంగా బిల్లులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చందవరం వద్ద పనులు ఎప్పటికి పూర్తవుతాయో, మంచి నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఇన్‌చార్జ్ డీఈ నారాయణస్వామిని వివరణ కోరగా.. ‘సమ్మర్ స్టోరేజీ వద్ద పనులు పూర్తయ్యాయి. మెయిన్ పైపులైన్ ద్వారా త్వరలో నీరు సరఫరా చేస్తాం. గ్రామాల్లో నీరు సరఫరా చేసే బాధ్యత పంచాయతీ అధికారులదే’ అని చెప్పారు.
దొనకొండ మండలంలో తాగునీటి అగచాట్లు
రెండు నెలలుగా సరఫరా కాని సాగర్ జలాలు
ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలం
మండు వేసవిలో విలవిల్లాడుతున్న ప్రజలు
రెండు నెలలుగా
తాగు నీటి కష్టాలు
సాగర్ జలాల సరఫరా గురించి అధికారులను అడిగితే పనులు చేస్తున్నామని మాట దాటేస్తున్నారు. ప్రభుత్వం రూ.2.5 కోట్లు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మందకొడిగా సాగాయి. నీరు ఎప్పుడు సరఫరా చేస్తారో చెప్పకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా నెలల సమయం కాలయాపన చేయడం సరికాదు.
– షేక్.రసూల్, దొనకొండ ముస్లిం బజారు
అధికారులకు ఫోన్ చేసినా
స్పందించలేదు
దొనకొండకు సాగర్ జలాలు సరఫరా కాక సుమారు రెండు నెలలు కావస్తోంది. ఏ అధికారిని అడిగినా రాజకీయ నాయకుల్లా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు. ఏప్రిల్ నెల పూర్తయింది. ఎండ ప్రతాపం ఎక్కువైంది. ఇళ్లలో వేసుకున్న డీప్‌బోర్లలో కూడా నీరు అడుగంటాయి. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి నీరు ఎప్పుడిస్తారో అధికారులు ప్రకటించాలి. మంచి నీటి కోసం అధికారులకు ఫోన్ చేస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు.
– బి.జయరావు, ఓబ్బాపురం


