● మరొకరికి తీవ్ర గాయాలు
అద్దంకి: స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి పట్టణంలోని రేణింగవరం రహదారిలో నల్లవాగు సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. ప్రమాదంలో కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలోని కెల్లంపల్లికి చెందిన జి.ప్రవీణ్‌కుమార్(24) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి శివప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా తెప్ప బోల్తా పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు అనకాపల్లి జిల్లా నుంచి కొందరు వ్యక్తులు నెల రోజుల క్రితం రాళ్లపాడు వచ్చారు. రోజూలాగే తెప్పలో వెళ్లి చేపలు పడుతుండగా ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో పెనుగాలులు వీయడంతో తెప్ప బోల్తా పడింది. అందులో ఉన్న వ్యక్తి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపేశారు. గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అద్దంకి: గుండ్లకమ్మ వంతెనపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి–దర్శి రహదారిలో ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. అద్దంకి పట్టణంలోని ఇందిరా నగర్‌కు చెందిన ఎం.అనిల్(35) హైదరాబాద్‌లో బేల్దారి పని చేస్తున్నాడు. అంకమ్మ కొలుపులు నిర్వహిస్తుండటంతో అద్దంకి వచ్చాడు. శనివారం రాత్రి కొలుపుల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆదివారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి ఫోన్ చేసి శ్రీనేను శ్మశానంలో పడుకుని ఉన్నాశ్రీ అని చెప్పాడు. ఆ తర్వాత కొంత సేపటికే గుండ్లకమ్మ వంతెన పైనుంచి ఎవరో వ్యక్తి దూకాడని తెలియడంతో భార్య, బంధువులు అక్కడికి చేరుకున్నారు. వంతెనపై విడిచిపెట్టిన చెప్పులు, సెల్‌ఫోన్ ఆధారంగా నదిలో దూకింది అనిల్ అని నిర్ధారించుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సుబ్బరాజు గజ ఈతగాళ్లను తీసుకొచ్చి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


