పెద్దదోర్నాలలో గడ్డి లారీ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

పెద్దదోర్నాలలో గడ్డి లారీ బీభత్సం

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ ప్రజలను కాసేపు గడగడలాడించింది. చెలరేగుతున్న మంటలతో ప్రయాణిస్తున్న లారీ దెబ్బకు శ్రీశైలం రహదారిలోని దుకాణాదారులు వణికిపోయారు. వివరాలు.. నంద్యాల జిల్లా మైదుకూరు నుంచి గడ్డి లోడుతో శ్రీశైల పుణ్యక్షేత్రంలోని గోశాలకు బయలుదేరిన లారీ ఆదివారం మధ్యాహ్నం పెద్దదోర్నాల చేరుకుంది. శ్రీశైల ముఖద్వారం ఆర్చి వద్ద గడ్డి రోళ్లకు విద్యుత్‌ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే లారీలోని గడ్డికి పూర్తిగా మంటలు వ్యాపించాయి. దీంతో లారీ డ్రైవర్‌ దిక్కుతోచని స్థితిలో రహదారి పొడవునా గడ్డి రోళ్లను పడేసుకుంటూ వెళ్లాడు. రహదారిపై ఒకటిన్నర కిలోమీటర్ల మేర గడ్డి రోళ్లు పడటంతో దట్టమైన పొగ, మంటలతో నిండిపోయింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు తమ వద్ద ఉన్న నీటితో మండుతున్న గడ్డి రోళ్లను ఆర్పే ప్రయత్నం చేశారు. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి లారీని శ్రీశైల రహదారిలోని నిర్మాణుష్య ప్రాంతానికి తరలించాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు స్థానిక యువకులు సహకారం అందించారు. తగలబడుతున్న గడ్డి రోళ్లను లారీ నుంచి కింద పడేశారు. మంటలు అర్పటంలో సహకరించిన యవకులకు అగ్నిమాపక కేంద్ర అధికారి మాల్యాద్రి, ఏఎస్సై పోలురాజు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ప్రమాదంలో రూ.40 వేల విలువ చేసే గడ్డి కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

విద్యుత్‌ తీగలు తగిలి లారీలో చెలరేగిన మంటలు

శ్రీశైలం రహదారి పొడవునా పడిపోయిన గడ్డి రోళ్లు

మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement