● భీకర గాలులకు ఎగ్జిబిషన్లు అతలాకుతలం
● ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఒంగోలు టౌన్: పెనుగాలులు సృష్టించిన బీభత్సానికి ఒంగోలు నగరం చిగురుటాకులా వణికింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం పడటంతో నగరంలోని మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని ఊర చెరువు, గుంటూరు రోడ్డులోని ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదురు, నార్త్ బైపాస్‌లోని ఎగ్జిబిషన్లలో దుకాణాల రేకులు గాలులకు ఎగిరిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. నార్త్ బైపాస్‌లోని ఎగ్జిబిషన్‌లో జెయింట్ వీల్ పడిపోయినట్లు పుకార్లు వచ్చాయి. దీంతో డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. డ్రాగన్ లైట్ల వెలుగులో రేకులను తొలగించారు. మిగిలిన ఎగ్జిబిషన్లను డ్రాగన్ లైట్ల వెలుగులో పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నార్త్ బైపాస్‌లోని పల్నాడు ఫర్నిచర్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ సైన్ బోర్డు గాలుల ధాటికి విరిగి రోడ్డుపై పడింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సైన్ బోర్డు తొలిగించారు. ఏ వన్ ఫంక్షన్ హాల్ ఎదుట ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మోకాలి లోతు నీరు నిలిచాయి. భీకర గాలుల ధాటికి ఒంగోలు నగరంలో పలుచోట్ల దుకాణాల పైకప్పులు ఎగిరిపోయాయి.


