భక్తిశ్రద్ధలతో కంపకళ్లి ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కంపకళ్లి ఉత్సవం

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

హనుమంతునిపాడు: చెన్నకేశవ నామ స్మరణతో హనుమంతునిపాడు మండలం నల్లగండ్ల పంచాయతీలోని చిన్నగొల్లపల్లి గ్రామం మారుమోగింది. ఐదు రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు కంపకళ్లి కార్యక్రమంతో ఆదివారం ముగిశాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చెన్నకేశవస్వామి భక్తులు కంపకళ్లిలో పాల్గొని మొక్కులు చెల్లించారు. పోలీసు బందోబస్తు మధ్య సాగిన ఈ ఉత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధలతో సాగింది. ముందుగా చెక్కా వంశస్తులు కంపకళ్లిపై దొర్లిన తర్వాత భక్తులు సైతం అదే రీతిలో మొక్కులు చెల్లించారు. గజవాహనంపై కొలువైన చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తితో కంపకళ్లి ప్రదక్షిణల అనంతరం పోతురాజుల వీర కేకల నడుమ భక్తులు గోవింద నామాన్ని స్మరిస్తూ కంపకళ్లి దొర్లి మొక్కులు చెల్లించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎస్సై రాజ్‌కుమార్‌ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈఓ గిరిరాజ నరిసింహబాబు, కమిటీ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement