పంచేసుకుందాం...! | - | Sakshi
Sakshi News home page

పంచేసుకుందాం...!

Mar 10 2026 7:16 AM | Updated on Mar 10 2026 7:16 AM

నువ్వు కొంచెం..నేను కొంచెం
అధికారం మనది.. మనల్ని అడిగేదెవరు..అడ్డగించేదెవరు... ఖాళీగా ఉందిగా నువ్వు కొంచెం..నేను కొంచెం పంచేసుకుందాం. అన్నట్లు టీడీపీ నేతల తీరు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఆక్రమణల జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు. చెరువు భూమిని చెరబట్టినా అధికారులు పట్టించుకోకుండా మిన్నకుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉలవపాడు: మండల పరిధిలోని ఎల్‌ రాజుపాలెంగ్రామంలోని రాజుల చెరువు లోని కొంత భూమి పై పచ్చనేతల కన్ను పడింది. రెండు నెలల నుంచి భూమిని చదును చేస్తున్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బీసీ నేతలు ఈ భూమిని ఆక్రమించారు. ఇద్దరు నేతలు చెరో ఎకరాను చదును చేశారు. ఒక నేత జామాయిల్‌ మొక్కలు వేశాడు. మరో నేత చదును చేసి మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాజుల చెరువు సుమారు 50 ఎకరాలు ఉంటుంది. వర్షం పడిన సమయంలో చెరువు నిండినా కూడా కొంత భాగం నీరు లేకుండా ఉంటుంది. దీనిని ఆసరాగా తీసుకున్న సదరు నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి పూనుకున్నారు. గతంలో ఎల్‌.రాజుపాలెంలోని ఎస్సీ, బీసీలు ఎవరైనా మరణిస్తే ఇక్కడే కూడా పూడ్చిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. అంటే మరుభూమిగా కూడా ఈచెరువు భూమి గతంలో వాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా వర్షాలు లేని సమయంలో ఇక్కడ శవాలను పూడ్చిపెడుతుంటామని గ్రామస్తులు అంటున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ చెరువు భూమిని ప్రస్తుతం ఇద్దరు టీడీపీ నాయకులు ఆక్రమించుకున్నారు. ఒక్కసారి మొక్కలు వేస్తే ఇక ఎవరిని పూడ్చిపెట్టడానికి రారు అనే ఆలోచన తో సదరు నాయకులు ఆక్రమించినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినా ఉపయోగంలేదని గ్రామస్థులు అంటున్నారు.

ఫిర్యాదు చేసినా ఫలితం ఏది..?

స్థానిక టీడీపీ నాయకులు చెరువు భూమిని ఆక్రమించి మొక్కలు నాటారని గ్రామస్తులు కలెక్టర్‌కు, స్థానిక తహసీల్దార్‌, నీటి పారుదల శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్‌ శ్రీనివాసరావు, నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఆక్రమణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు భూమిని నేతలు ఆక్రమించారని అధికారులు నెల రోజుల క్రితమే గుర్తించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ఆక్రమణలను తొలగిస్తామని తెలియచేశారు. కానీ టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు కూడా ఆక్రమణదారుల వైపు ఉండి వారికి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రమైన ఉలవపాడులోని టీడీపీ నేత కుమారుడు అధికారులతో మాట్లాడి ఆక్రమణదారుల జోలికి వెళ్లవద్దని చెప్పడంతో అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు ఆక్రమణలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్‌ఓ పీరయ్య వివరణ కోరగా ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, నీటిపారుదలశాఖ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల సమక్షంలో పరిశీలించినట్లు తెలిపారు. భూమి ఆక్రమణపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించామని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజుపాలెంలో రాజులచెరువు ఆక్రమణ

రెండు ఎకరాల్లో జామాయిల్‌ సాగు

ఇద్దరు టీడీపీ నేతల భూ కబ్జా

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement