త్రిపురాంతకం: సీఎం చంద్రబాబు పాలన మొత్తం దోపిడీమయమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని జి.ఉమ్మడివరం ఉగ్రనరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై నుంచి ఆయన మాట్లాడారు. సంపద సృష్టించామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాకా ఊది చెబుతుంటే ఆ సంపద తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి చేరడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కష్ట కాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. 2029లో వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ కోసం మీరు చేసిన త్యాగాలు వృథా కావని, ప్రతి ఒక్కరినీ గుర్తు రెండేళ్ల కూటమి పాలన మొత్తం అవినీతిమయమేనని మండిపడ్డారు. అందుకే చంద్రబాబు, లోకేష్ సభలకు జనం నుంచి స్పందన ఉండటం లేదన్నారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారని, ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అలాంటిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, యూత్ కన్వీనర్ ఏ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఎస్ రంగబాబు, ఎం గాలెయ్య, సుబ్రహ్మణ్యం, బాలకోటిరెడ్డి, ఆర్ పిచ్చయ్య, అంజయ్య, పెద్దిరాజు, వీరయ్య, ఆదిరాములు, నాసరయ్య, హనుమంతు తదితరులు ఉన్నారు.
తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకి చేరుతున్న సంపద
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


