● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
త్రిపురాంతకం: కారు – ఐషర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడుకు చెందిన పోతుల బాలరంగయ్య, శ్రీను, చెన్నయ్య, సుబ్బయ్య కారులో పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొపకొప్పలలోని అమ్మవారి గుడికి వెళ్లి తిరిగి అమానిగుడిపాడు వస్తున్నారు. ఆ సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న ఐషర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతుల బాలరంగయ్య మృతిచెందగా, మిగిలిన ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ శివరామయ్య తెలిపారు.
● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్:
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుల విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వృద్దులు, నడవలేనిస్థితిలో ఉన్న వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ వీవీ రమణకుమార్, వన్‌టౌన్ సీఐ నాగరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, కొండపి సీఐ సోమశేఖర్, ఎస్సై జనార్దన్‌రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్ పాల్గొన్నారు.


