ఈ ఏడాదైనా ఇంటర్‌ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేనా? | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదైనా ఇంటర్‌ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేనా?

Feb 22 2026 8:35 AM | Updated on Feb 22 2026 8:35 AM

ఈ ఏడా

ఈ ఏడాదైనా ఇంటర్‌ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేనా?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఏదైనా ఒక అవినీతి జరిగినప్పుడు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకున్నప్పుడే తిరిగి అలాంటి తప్పులు జరగవు. గతేడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై అనుమానాలు వెల్లువెత్తినా బోర్డు అధికారుల్లో కనీస చలనం లేదు. బోర్డు అధికారులు స్వయంగా తప్పులు అంగీకరించినా రాజకీయ నేతల ఒత్తిడితో సంబంధిత కళాశాల యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ కళాశాలకు పరీక్ష కేంద్రం తొలగించినా పబ్లిక్‌ పరీక్షల ప్రాక్టికల్‌ సెంటర్‌ను యథావిధిగా ఇచ్చారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రైవేట్‌ కళాశాలలకు పరీక్ష కేంద్రాలు ఇచ్చి ఇన్విజిలేటర్లుగా అదే కళాశాలల అధ్యాపకులను నియమించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో ఏం జరిగిందంటే?

కందుకూరులో గతేడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు గాయత్రి జూనియర్‌ కళాశాల, టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నారాయణ జూనియర్‌ కళాశాల, వేవికా జూనియర్‌ కళాశాల (ఆక్స్‌ఫర్డ్‌)లకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. జంబ్లింగ్‌ పద్ధతిలో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు. విద్యార్థులకు సొంత కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించరు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లు, సిబ్బందిని మాత్రం అదే కళాశాలకు చెందిన వారిని నియమిస్తున్నారు. దీంతో ప్రైవేటు కళాశాలల మధ్య ఉన్న పోటీతత్వం, ఆధిపత్య పోరు కారణంగా విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్నారు. గతేడాది పబ్లిక్‌ పరీక్షల్లో గాయత్రి కళాశాలకు చెందిన ఇద్దరు టాపర్లు ఎం.అవినాష్‌బాబు, టి.సాయితేజస్వినిలు శ్రీవివేకా (ఆక్స్‌ఫర్డ్‌) కళాశాలలో పరీక్ష రాశారు. వీరిద్దరూ టాపర్లగా ఉండటంతో శ్రీవివేక కళాశాల యాజమాన్యం ఆ ఇద్దరి విద్యార్థులను టార్గెట్‌ చేసింది. ఇంగ్లిష్‌ జవాబు పత్రాన్ని ట్యాంపరింగ్‌ చేసింది. విద్యార్థులు పరీక్ష రాసి జవాబు పత్రాన్ని ఇన్విజిలేటర్‌కు ఇచ్చిన తర్వాత వాటిల్లో జవాబులను కొట్టేశారు. వీరిద్దరికి మార్కులు తగ్గడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు రీకౌంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు విషయం బయటపడింది. దీన్ని పరిశీలించిన ఇంటర్‌ బోర్డు అధికారులు ఇది కచ్చితంగా ట్యాంపిరింగ్‌ జరిగినట్లు నిర్థారించి ఆ విద్యార్థులకు మార్కులు కూడా కలిపి తిరిగి మార్కు లిస్టులు పంపించారు.

ట్యాంపరింగ్‌ చేసిన వారిపై చర్యలు నిల్‌

ట్యాంపరింగ్‌కు కారకులైన ఇన్విజిలేటర్లపై, యాజమాన్యంపై ఎలాంటి చర్యలు లేవు. ఓపెన్‌ స్కూల్లో మాస్‌ కాపియింగ్‌ జరిగితేనే ఇన్విజిలేటర్లను సస్పెండ్‌ చేసే ఉన్నతాధికారులు పబ్లిక్‌ పరీక్షల్లో జవాబు పత్రాలు ట్యాంపరింగ్‌ చేసినట్లు నిర్ధారణ అయినా ఎలాంటి చర్యలు లేదు. మూడు, నాలుగేళ్ల నుంచి ఆ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన ఇతర కళాశాలలకు చెందిన టాపర్‌ విద్యార్థులకు మార్కులు తగ్గిపోతున్నాయి.

ఈ ఏడాదీ అలా జరగదని గ్యారెంటీ ఏంటి?

గతేడాది జరిగిన ట్యాంపరింగ్‌ను తిరిగి ఈ ఏడాది కొనసాగించరని గ్యారెంటీ ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది శ్రీగాయత్రి జూనియర్‌ కళాశాల, టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నారాయణ జూనియర్‌ కళాశాల, నాగార్జున జూనియర్‌ కళాశాలలకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ ఏడాది శ్రీవివేక (ఆక్స్‌ఫర్డ్‌) కళాశాలకు తొలగించి నాగార్జున జూనియర్‌ కళాశాలకు కేంద్రాన్ని కేటాయించారు. వీటిల్లో ఒక టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మాత్రమే ప్రభుత్వ కళాశాల. ఈ కేంద్రాల్లో చీఫ్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను మాత్రమే ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను నియమిస్తారు. ఇన్విజిలేటర్లు, పరీక్షల నిర్వాహణ సిబ్బందిని ఆయా కళాశాలల్లో పని చేసే అధ్యాపకులు, సిబ్బందిని నియమిస్తున్నారు. దీంతో అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇంటర్‌ బోర్డు తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలకు టాపర్‌లైన విద్యార్థులకు శాపంగా మారుతుంది.

అధికార పార్టీ అండతోనే..

గతంలో ఒంగోలు శ్రీప్రతిభ జూనియర్‌ కళాశాల టాపర్‌గా నిలిచేందుకు మార్కులు ఆప్‌లోడ్‌ చేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా అధిక మార్కులు కలిపి జిల్లా టాపర్‌గా నిలిచారు. ఆ వ్యవహారం బయట పడటంతో ఆ కళాశాలపై అప్పట్లో బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ కందుకూరులో ఇద్దరు ప్రతిభ గల విద్యార్థుల జవాబు పత్రాన్ని ట్యాంపరింగ్‌ చేసినట్లు గుర్తించి మార్కులు కలిపి కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై బారీ స్థాయిలో ముడుపులు ముట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల జవాబు పత్రాలు ట్యాంపరింగ్‌ చేయడం అంటే బాధ్యులపై క్రిమినల్‌ కేసులతో పాటు ఆ కళాశాలను సీజ్‌ చేయాల్సి ఉంది. కనీసం బోర్డు అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయలేదు.

ట్యాంపరింగ్‌ జరిగినట్లు బోర్డు నిర్థారించి మార్కులు కలిపిన మార్క్‌లిస్టు (పైల్‌)

ట్యాంపరింగ్‌ జరిగిన అవినాష్‌బాబుకు

చెందిన ఇంగ్లిష్‌ జవాబు పత్రం (ఫైల్‌)

గతేడాది ఘటనలపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ప్రైవేట్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలపై అనుమానాలు

అవే కళాశాలలకు చెందిన అధ్యాపకులే ఇన్విజిలేటర్లు

ఇతర కళాశాలల విద్యార్థుల నిరుత్సాహం

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఈ ఏడాదైనా ఇంటర్‌ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేనా? 1
1/1

ఈ ఏడాదైనా ఇంటర్‌ పరీక్షలు కట్టుదిట్టంగా జరిగేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement