సహకారం కొరవడి.. | - | Sakshi
Sakshi News home page

సహకారం కొరవడి..

Feb 22 2026 7:01 AM | Updated on Feb 22 2026 7:01 AM

సహకార

సహకారం కొరవడి..

సహకార సిబ్బంది నిరవధిక సమ్మె 16వ తేదీ నుంచి మూతపడినపీఏసీఎస్‌లు ఉమ్మడి జిల్లాలో నిలిచిన సేవలు నిలిచిన ఈ క్రాప్‌ రెన్యువల్స్‌..అన్నదాతలకు తప్పని తిప్పలు రేపటి నుంచి నిలిచిపోనున్న శనగ, మొక్కజొన్న కొనుగోళ్లు జీవో నంబర్‌ 36 అమలు చేయాలని డిమాండ్‌

అద్దంకి: జిల్లా సహకార కేంద్రబ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు నిరవధిక ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని పలుమార్లు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. దాంతో జిల్లా వ్యాప్తంగా 173 సహకార సంఘాలు మూతపడ్డాయి. 293 మంది సిబ్బంది విధులు బహిష్కరించడంతో సొసైటీల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. లావాదేవీలు స్తంభించాయి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచి కార్యాలయాల్లో సైతం పీఏసీఎస్‌లకు సంబంధించిన లావాదేవీలు జరగడం లేదు. రైతుల పంట రుణాలు, భూములపై వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ ఆగిపోయాయి. అంతేకాకుండా ఈ క్రాప్‌ రెన్యువల్‌, సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్న శనగలు, మొక్కజొన్న కొనుగోళ్లు నిలిచిపోయే అవకాశం ఉంది. సకాలంలో రుణాలు రెన్యువల్‌ చేయకుంటే అపరాధ రుసుం పడుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉద్యోగుల తొలగింపు కుట్ర..

2019 తరువాత 44 మంది ఉద్యోగులను నియమించారు. వారిని తొలగించాలని ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మల్లా తమ ఉద్యోగాలు మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో నంబరు 36 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమను చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు దశల్లో పోరాటం..

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి పీఏసీఎస్‌ ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టారు. 18 నెలలుగా దశల వారీ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) కమిషనర్‌ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. తమ డిమాండ్లపై శాసనసభ, శాసనమండలిలో చర్చించాలని వినతి పత్రాలు కూడా అందజేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గుంటూరు సహకార కమిషనర్‌ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని 23 జిల్లాల ఉద్యోగులు 13 రోజుల పాటు ‘వంటా–వార్పు’ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈనెల 16వ తేదీ నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. సమస్యలకు పరిష్కారం లభించే దాకా ఎన్ని రోజులైనా సమ్మెలోనే ఉంటామంటూ ఉద్యోగులు, జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

సిబ్బంది డిమాండ్లు ఇవే..

జీవో నంబరు 36న వెంటనే అమలు చేయాలి. 2019 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ చేసి, ఇప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్‌ రూ.2 లక్షలు కాకుండా, గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసి పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, 2019 తరువాత చేరిన ఉద్యోగులకూ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసే గ్రాట్యుటీ ఇచ్చి రెగ్యులర్‌ చేయాలని, వారికీ జీవో నంబరు 36ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించి, సర్వీస్‌లో మరణిస్తే రూ.20 లక్షలు టర్మ్‌ బీమా సదుపాయాన్ని కల్పించాలని, సంఘాల లాభ నష్టాలతో పని లేకుండా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరిస్తున్నారు.

సహకారం కొరవడి..1
1/1

సహకారం కొరవడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement