రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 22 2026 7:01 AM | Updated on Feb 22 2026 7:01 AM

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

పూర్తయిన ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 47,759 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు

మార్కాపురం:

ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 24వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 47,759 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో జనరల్‌ విద్యార్థులు 20,225, ఒకేషనల్‌ 2050 మంది, ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ 18,908, ఒకేషనల్‌ 1576 మంది పరీక్షలు రాయనున్నారు. కంభం, అర్ధవీడు, పెద్దదోర్నాల, గిద్దలూరు, యర్రగొండపాలెం కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 3 సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లో డిప్యూటీ తహసీల్దార్‌, ఏఎస్‌ఐ, లెక్చరర్‌ ఉంటారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌లో ఇద్దరు లెక్చరర్‌లు ఉంటారు. 67 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో, ఆర్‌జేడీ, కమిషనర్‌ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లను నిషేధించటంతో పాటు విద్యార్థినులను తనిఖీ చేసేందుకు మహిళ పోలీసును నియమించారు. ఫీజు కట్టిన ప్రతి విద్యార్థి పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించనున్నారు.

కళాశాలలో ఫీజు చెల్లించలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వకపోయినా, పరీక్ష రాయనీయకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు నేరుగా మనమిత్ర యాప్‌ ద్వార్యా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రతి సెంటర్‌ వద్ద పూర్తి వివరాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రంలో మెడికల్‌ కిట్‌, తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తారు. ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్‌లలో అక్కడ చదివే విద్యార్థులను మరో కేంద్రంలో పరీక్షలు రాయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement