వెలిగొండ నిర్వాసితుల ధర్నా
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు డి.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన నిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు కరువు నుంచి శాశ్వతంగా బయటపడాలంటే తక్షణమే ప్రభుత్వం నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి రూ.20 లక్షలకు పెంచి ఏకమొత్తంలో 11 గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల కాలనీల్లో పునరావాస చర్యలు వెంటనే పూర్తి చేయాలన్నారు. గుండంచర్ల గ్రామ ప్రజలకు అవసరమైన మరో 14 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో ఉపాధి కోసం వలసలు పోతున్నారని, దీంతో కొన్ని గ్రామాల్లో వలసపోయిన కుటుంబాల్లో సర్వే జరగలేదన్నారు. మిస్ అయిన కుటుంబాలను అర్హుల జాబితాలో చేర్చి వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సంఘ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. అనంతరం కార్యాలయంలోకి వెళ్తున్న జేసీ కారును ఆపి సమస్యలను వివరించి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి, రాజేశ్వరరెడ్డి, బుషికేశవ, రామకృష్ణారెడ్డి, బి.రామకృష్ణా, వెంకటసుబ్బయ్య, సహదేవుడు, వై సురేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


