దొంగకు సంకెళ్లు
కందుకూరు: వ్యక్తిని కత్తితో బెదిరించి బ్రాస్లెట్ లాక్కెళ్లిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పొన్నలూరు మండలం శింగరబొట్లపాలెం గ్రామానికి చెందిన ఐనంపూడి రాములు వ్యక్తిగత పనులపై కందుకూరు పట్టణానికి వచ్చాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ సింగరాయకొండ రోడ్డులోని లారీ స్టాండ్ వద్ద రోడ్డు పక్కకు బైక్ ఆపాడు. ఆ సమయంలో దొంగ వచ్చి కత్తితో బెదిరించి రాములు చేతికి ఉన్న బ్రాస్లెట్‌ను లాక్కుకొని వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా దొంగతానికి పాల్పడింది పట్టణంలోని చాకలిపాలేనికి చెందిన తోటకూర లక్ష్మయ్యగా గుర్తించి అరెస్టు చేసిట్లు ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి బ్రేస్లేట్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై తెలిపారు. కేసును తక్కువ వ్యవధిలోనే ఛేదించిన ఎస్సై బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.రమేష్, వన్యాకుమార్‌లను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
కంభం: మండలంలోని నల్లకాల్వ సమీప మామిడి తోటలో మంటలు చెలరేగి చెట్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సోమశేఖర్ మామిడి తోటలో మంటలు చెలరేగడంతో సుమారు 30 చెట్లు అక్కడికక్కడే దగ్ధమయ్యాయి. స్థానికుల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే మామిడి చెట్లతో పాటు పలు కొబ్బరి చెట్లు కూడా దగ్ధమయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా ఉద్దేశ పూర్వకంగానే నిప్పంటించారా..అనేది తెలియాల్సి ఉంది.


