కనిగిరిలో అర్ధరాత్రి హడావుడి
కనిగిరి రూరల్:
అధికార పార్టీ అండతో రియల్ ఎస్టేట్ ముసుగులో కొందరు అర్ధరాత్రి వాల్మీకి బోయ కులస్తుల సమాధుల తోటను జేసీబీతో చదును (సమాధులు తొలగించి, చిల్లచెట్లు తొలగించే ప్రక్రియ) చేయడాన్ని వాల్మీకి కులస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్న సంఘటన శనివారం జరిగింది.
ఇదీ..జరిగింది
కనిగిరి పట్టణంలోని (ఎన్‌హెచ్565 హైవే రోడ్డు పక్కన) కొత్తూరు అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా సర్వే నంబర్ 554లో 5.36 ఎకరాల భూమి ఉంది. దానిలో సుమారు ఎకరాలో వాల్మీకి బోయ కులస్తులు తమ తాత ముత్తాతల కాలం నుంచి సమాధుల తోట స్థలంగా వినియోగించుకుంటున్నారు. అందులో సుమారు 50 సెంట్లలో చనిపోయిన వారి అంత్యక్రియలు, సమాధులు వగైరా ఉన్నాయి. ఆ భూమి విషయంలో కొంతకాలంగా వాల్మీకి బోయ కులస్తులు, రియల్ ఎస్టేల్ వ్యాపారులకు మధ్య వివాదం రగులుతోంది. దీనిపై కోర్టులో కూడా వివాదం నడుస్తున్నట్లు సమాచారం. ఇటీవల జనవరి 30వ తేదీన రాత్రికి రాత్రే రియల్డర్‌లు అధికార పార్టీ అండతో వాల్మీకి బోయ సమాధుల తోటను దున్నేశారు. దీంతో వారు నిరసన ర్యాలీలు నిర్వహించి అన్ని శాఖల అధికారులకు వినతి పత్రాలు అందచేశారు. తమ శ్మశాన వాటిక భూమి అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రియల్టర్లు కాస్త సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు ఏంటంటే..
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధికార పార్టీ అండతో మళ్లీ రియల్ వ్యాపారులు రంగంలోకి దిగారు. జేసీబీ, లారీలతో సమాధుల తోట స్థలాన్ని చదును చేసే ప్రక్రియ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వాల్మీకి బోయ కులస్తులంతా అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అక్రమణదారులు క్షణాల్లో పారిపోయారు. వాహనాలు బయటకు వెళ్లకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. మళ్లీ వారు అక్కడికి రాకుండా రాత్రంతా శ్మశాన వాటిక వద్దే టెంట్ వేసి జాగారం చేశారు. ఈ సందర్భంగా వాల్మీకి బోయలు మాట్లాడుతూ అధికార పార్టీ అండతో గతంలో తమపై కోర్టులో కేసులు వేసిన వారే సమాధుల తోట స్థలాన్ని చదును చేసేందుకు వచ్చారని ఆరోపించారు. దీని వెనుక నలుగురి ప్రమేయం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం భూములకు రెక్కలు రావడంతో అక్రమణకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో ఎం.సుబ్బయ్య, సాయి, వెంకట్రావ్, సీహెచ్ శివ, మాల్యాద్రి, పద్మ, సాయమ్మ, నాగరత్తమ్మతో పాటు సుమారు 200 మందికిపైగా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు రంగ ప్రవేశం చేసి బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. సీఐ ఉప్పు శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎన్.జయలక్ష్మి, వివిధ శాఖల అధికారులున్నారు.
శ్మశానం ఆక్రమణకు రియల్టర్ల పన్నాగం
జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుకున్న వాల్మీకి బోయలు
రాత్రంతా శ్మశాన వాటిక వద్దే జాగారం చేస్తూ నిరసన
పోలీసు, రెవెన్యూ అధికారుల జోక్యంతో ఆందోళన విరమణ
కనిగిరిలో అర్ధరాత్రి హడావుడి


