ఏళ్లుగా కన్నీళ్లు..ఇరవైలో అరవైలు!
జిల్లాలో 1009 ఊళ్లలో ఫ్లోరైడ్ మహమ్మారి శాశ్వత పరిష్కారం దిశగా పడని అడుగులు ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పెడతామంటూ పవన్ హామీ ఇచ్చి ఏడు నెలలు ఒక్క అడుగు కూడా ముందుకు పడని వైనం రాజుపాలెంలో సగటున ఇంటికొకరు బాధితులు అరకొరగా సాగర్ జలాల సరఫరా ప్రజల బాధలు పట్టని అధికారులు
ఫ్లోరైడ్ మహమ్మారి ప్రజల జీవితాలను చిదిమేస్తోంది. ఫ్లోరిన్‌తో నిండిన నీరు తాగిన వారు ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు ఫ్లోరైడ్ బాధితులున్నారు. అటువంటి గ్రామమే పొదిలి మండలంలోని రాజుపాలెం. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక్కడి ఫ్లోరైడ్ సమస్యకు చెక్‌పెడతానని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి వెళ్లి ఏడు నెలలైనా అమలుకు నోచుకోలేదు. రాజుపాలెం గ్రామంలోని ఫ్లోరైడ్ సమస్యపై ‘సాక్షి’ ఫోకస్..
పొదిలి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 1,009 ఊళ్లలో ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాడుతున్నారు. ప్రధానంగా కనిగిరి ప్రాంతంలో 339, దర్శి ప్రాంతంలో 120, మార్కాపురం పరిధిలో 113 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఫ్లోరిన్ మూలంగా గారపళ్లు, గొగ్గిరి కొయ్యలు, దంతాలు విరిగిపోవటం, కాళ్లు వంకర్లు, పాదాలు వేళ్లు వంకర్లు తిరగటం, నడుంనొప్పులు, కీళ్ల నొప్పులతో అల్లాడిపోతున్నారు. జలజీవన్ మిషన్ కింద మంచినీటి పథకాన్ని ప్రారంభించేందుకు గత ఏడాది జూలై నెలలో మార్కాపురానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పెడతామంటూ హామీ ఇచ్చి వెళ్లారు. అది హామీగానే మిగిలిపోయింది.
రాజుపాలెంలో ఇంటికొక్కరు..
పొదిలి శివారులోని రాజుపాలెంలో సుమారు 1000 మంది జనాభా ఉండగా 250 వరకు గృహాలున్నాయి. ఇక్కడ ఇంటికొక్కరు చొప్పున బాధితులు ఉన్నారు. ఏళ్ల తరబడి ఫ్లోరైడ్ భూతం సగటున ఇంటికొకరు చొప్పున బాధితులను చేస్తున్నా..ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. సర్వే, పరీక్షల పేరుతో గ్రామానికి వచ్చి, వారిలో ఆశలు నింపటం తప్ప, ఫ్లోరైడ్ నుంచి వారికి విముక్తి కలిగించే పనులు ఏమీ చేయటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఢిల్లీ స్థాయిలో రాజుపాలెం ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం గట్టి ప్రయత్నం చేశారు.
ఇరవైలో అరవైలా...
ఫ్లోరైడ్ సంబంధిత రోగాలతో నెమ్ము, లివర్, కిడ్నీలు పాడైపోవటం మూలంగా పలువురు తక్కువ వయస్సులోనే మృత్యువాత పడ్డారని గ్రామస్తులు వాపోతున్నారు. కీర్తి వెంకటస్వామి, ఎం.వెంకటరావు, తుల్లూరి తిరుపతమ్మ, చాతరాజుపల్లి చినకాశయ్య కుమారుడు, తాతా కిష్టయ్య కుమారుడు ఇలా మృత్యుపాలైన వారిలో ఉన్నారని స్థానికులు చెప్పారు.
సాగర్ నీటి కోసమని...
గతంలో అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్‌బెన్ జోషి గ్రామంలో పర్యటించారు. పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే ఎన్‌ఏపీ పథకం అమలయ్యేలా ఆగమేఘాలపై ఉత్తర్వులు వచ్చేలా చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం జరిగింది. సాగర్ నీరు గ్రామానికి చేరింది. దీంతో సమస్య తీరిందనుకుని గ్రామస్తులు కుదుట పడే లోపే పథకం అటకెక్కింది. సాగర్ నీరు ఆగిపోయింది. పరిస్థితి మొదటికొచ్చింది. ఏదో మొక్కుబడిగా సాగర్‌నీరు సరఫరా అవుతోంది. వారానికో, పదిరోజులకొకమారు సాగర్‌నీరు ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాకుండా కొందరికే అందుతుండటంతో సమస్య తీరలేదు. అధికారులు శ్రద్ధ తీసుకుని సాగర్‌నీరు క్రమం తప్పకుండా సరఫరా చేయడంతో పాటు, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బోరు నీరే దిక్కు
సాగర్‌నీరు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. పిల్లలు పనులకు పోతారు. ఇంట్లో ఆయన లేవలేడు, నేను కూర్చోలేను ఇక రోడ్డుకు వెళ్లి సాగర్‌నీరు తెచ్చేది ఎలా. అందుకే ఇంట్లో బోరు నీరే తాగాల్సి వస్తోంది. వీధుల్లో కొళాయిలు ఏర్పాటు చేసి, సాగర్‌నీరు సక్రమంగా వచ్చేలా చేయాలి.
– చల్లా తిరుపతమ్మ
పనికి పోయేది లేదు
నడుంనొప్పి కూచోనివ్వదు. నిలబడనివ్వదు. ఒకటే నొప్పి తీపుగా వస్తుంటుంది. మంచానికే పరిమితం అయ్యాను. ఏపనీ చేయలేను. మాయదారి నీరు తాగి వళ్లంతా నొప్పులే, కాళ్లు, మోకాళ్లు తీపులు తీస్తుంటాయి. ఏ పనికిపోయేందుకు వీలు లేదు. ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో వాళ్లు చేస్తేనే కుటుంబం గడిచేది.
– జూపల్లి వెంకటేశ్వర్లు
శ్రద్ధతో సమస్య పరిష్కారం చేయాలి
ఫ్లోరైడ్ భూతం నుంచి రాజుపాలెంను కాపాడేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రద్ధతో పనిచేయాలి. సాగర్‌నీరు క్రమం తప్పకుండా సరఫరా జరగాలి. శాశ్వత పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకోవాలి. బాధితులందరికీ వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ
ఈమె పేరు భాగ్యలక్ష్మి.. 30 ఏళ్లు వచ్చినా కదలలేదు.. మెదలలేదు..అడగలేదు..అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. అంతో ఇంతో పెడితే తినటం, మౌనంగా జోగాడుకుంటూ వచ్చి కూర్చోవటం. బిడ్డ పరిస్థితి చూస్తున్న కన్న వారికి కడుపు తరుక్కు పోతోంది. ఫ్లోరైడ్ మహమ్మారితో ఆమె భవిష్యత్ అంధకారంగా మారిపోయింది. కన్నవారు మౌనంగా రోదిస్తూ ఆమె బాగోగులు చూస్తున్నారు.
ఏళ్లుగా కన్నీళ్లు..ఇరవైలో అరవైలు!


