ఐక్యంగా ముందుకు..
ఒంగోలు సిటీ:
చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలందరి సమన్వయంతో ప్రజల పక్షాన పోరాడతామన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి వారితో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న దగా పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వారి పక్షాన నిలబడి ఆందోళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెల నుంచే ఉద్యమానికి శ్రీకారం చుడదామన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు అందరం ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.
చెవిరెడ్డికి ఘనస్వాగతం..
ఎనిమిది నెలలుగా జైలులో ఉండి బయటకు వచ్చిన ఆయనకు చంద్రబాబు దుష్టరాజకీయాలు తెరపడాలంటూ మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి చెవిరెడ్డి రోడ్డు మార్గంలో నగరానికి చేరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. నగర శివారు బృందావనం కళ్యాణ మండపం ఎదురుగా ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒంగోలు ఏఎంసీ మీదుగా ర్యాలీగా బయలు దేరి బైపాస్ మీదుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద మహిళలు గుమ్మడికాయ లతో దిష్టి తీశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.నాగార్జునరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కెవీ.రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహాగౌడ్, లీగల్ సెల్ ఒంగోలు నియోజకవర్గ ప్రెసిడెంట్ ధర్నాసి హరిబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని శాలువాలు, బొకేలు, గజమాలతో ఘనంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సన్మానించారు.
చంద్రబాబు ప్రభుత్వం పై నిరంతర పోరాటం
హామీలు ఇచ్చి మాట తప్పారు
ప్రజల పక్షాన నిలుద్దాం..జగన్‌ను సీఎం చేసుకుందాం..
వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఒంగోలులో చెవిరెడ్డికి ఘనస్వాగతం
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు


