మార్చి 15లోగా బిల్లులు అప్‌లోడ్ చేయాలి
మార్కాపురం టౌన్: ఉపాధి హమీ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసి మార్చి 15లోగా బిల్లులను అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, డ్వామా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రలజకు ఉపయోగకరమైన పనులనే ఉపాధి హామీలో చేపట్టాలని స్పష్టం చేశారు.
హాస్టళ్ల నిర్వహణపై దృష్టి సారించండి
జిల్లాలో హాస్టళ్ల నిర్వహణ తీరుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో మార్చి 8వ తేదీ నాటికి టాయిలెట్ల నిర్మాణం, ఇతర మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్, వివిధ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ పనుల పరిశీలన
వచ్చేనెల మొదటి వారం నుంచి తన చాంబర్‌లోనే విధులు నిర్వహిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు కూడా కార్యాలయాలు ఏర్పరుచుకుని వాటి చిరునామాలను తెలియజేస్తున్నారని చెప్పారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజా సమస్యలు, మీ కోసం అర్జీలు సత్వరమే పరిష్కరించేందుకు వీలుంటుందన్నారు. వివిధ సెక్షన్లకు గదుల కేటాయింపు గురించి కలెక్టర్‌కు జేసీ వివరించారు. ముందుగా కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో పూజలు నిర్వహించారు.
ఉపాధి హామీపై సమీక్షలో కలెక్టర్ రాజాబాబు
మార్కాపురంలో నూతన కలెక్టరేట్
పనుల పరిశీలన


