సంపూర్ణత అభియాన్ 2. ప్రారంభం
● ఫ్లెక్సీలో వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఫొటోపై సర్వత్రా విస్మయం
మార్కాపురం టౌన్: యాస్పిరేషనల్ బ్లాక్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని నూరు శాతం సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. కేంద్రం నిర్దేశించిన 6 ఇండికేటర్లలో ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీలోగా నూరు శాతం సంతృప్తి సాధించడంపై దృష్టి సారించాలని చెప్పారు. సీపీఓ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం బ్లాక్(మండలం)ను పథకం కింద కేంద్రం ఎంపిక చేసిందన్నారు. మొత్తం 39 అంశాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పఽఽథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్, ఎంపీడీఓ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ సాక్షిగా ప్రొటోకాల్ ఉల్లంఘన
సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభం సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ ఫ్లెక్సీలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటో కాకుండా ఏ అర్హతా లేని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఫొటో ముద్రించడాన్ని గమనించి పలువురు అధికారులే ఆశ్చర్యపోయారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్యే ఫొటో స్థానంలో టీడీపీ నాయకుడి ఫొటో ఎలా వేస్తారంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. కలెక్టర్ సాక్షిగా అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించడాన్ని ఆక్షేపించారు.


