ఆర్టీసీ బస్సులో పొగలు..
పొదిలి రూరల్: పామూరు నుంచి జగిత్యాల వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసు నంబరు 7822 మార్కాపురం జిల్లా పొదిలి సమీపంలో రాగానే బస్సులో మంటలు రావడంతో బస్సు నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన పొదిలి నగర పంచాయతీలోని మాదాలవారిపాలెంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కోరుట్లకు చెందిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో పొదిలి నుంచి బయలుదేరింది. మాదాలవారిపాలెం గ్రామ సమీపంలో బస్సులో ఆకస్మికంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవరు సీటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి పొగలు వచ్చాయని ప్రయాణికులు తెలిపారు. వెంటనే స్పందించిన బస్సు డ్రైవరు సమీపంలోని పొదిలి డిపోకు తరలించి ప్రయాణికులందరినీ దింపి మరమ్మతులు చేయించారు. మొత్తం మీద బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.


