వైద్యులు రారు..మందులీయరు
పొదిలి సీహెచ్‌సీలో సక్రమంగా విధులకు రాని వైద్యులు మందులు కావాలంటే బయట తెచ్చుకోవాల్సిందే.. ఫిర్యాదులపై ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి
పొదిలి: జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు అధ్వానంగా ఉన్న వాటిల్లో పొదిలి ప్రభుత్వ వైద్యశాల ఒకటని కలెక్టర్ రాజాబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సామాజిక వైద్యశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మాసిస్ట్, వైద్య సేవలు పొందే గదులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు సక్రమంగా విధుల్లో ఉండటం లేదని, నర్సింగ్ స్టాఫ్ రౌండ్స్ విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బయటికి మందులు రాస్తున్నారని తనకు ఫిర్యాదులు వస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. పరిసరాల అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తరచూ వైద్యశాలలను తనిఖీ చేస్తానని వైద్యశాల నిర్వహణ పట్ల, రోగులకు అందించే సేవల్లో, వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో మార్పు లేకపోతే చర్యలు తప్పవని తుది హెచ్చరికలిచ్చారు. తహసీల్దార్, నగర పంచాయతీ కమిషనర్ తరచుగా వైద్యశాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది ఉదయం, సాయంత్రం థంబ్ హాజరు వేయాల్సి ఉంటుందని అన్నారు. సీసీ కెమెరాల ఫీడ్ బ్యాక్ ఆధారంగా సక్రమంగా విధులు నిర్వహించని వైద్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయనతో పాటు తహసీల్దార్ కృష్ణారెడ్డి, నగర కమిషనర్ మారుతీరావు ఉన్నారు.


