ఒంగోలు నుంచే కూటమి పతనానికి నాంది..
పల్లెపల్లెలో ప్రభుత్వంపై నిరంతర పోరాటం పోరాటాల నుంచి పురుడుపోసుకున్నదే వైఎస్సార్‌సీపీ అందరం కలసికట్టుగా ముందుకు.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు భారీ ర్యాలీ
ఒంగోలు టౌన్: చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాటతప్పారని, పరిపాలన చేతకాక రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పాలన చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో బెయిల్ మీద వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. చెవిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజలు చంద్రబాబును నమ్మి మోసపోయామని బాధపడుతున్నారని, రాబోవు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటాలకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ప్రతి పల్లె నుంచి ప్రజలు తిరుగుబాటు చేయడం ఎంతో దూరంలో లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒంగోలు నుంచే కూటమి పతనానికి నాంది మొదలవుతుందని స్పష్టం చేశారు. జిల్లా నాయకులు, కార్యకర్తలందరూ ఒకతాటి మీద నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు.
తప్పుడు కేసులకు భయపడం..
చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పోరాటాలతో పుట్టిన పార్టీ అని, అనేక అవమానాలను తట్టుకొని పుట్టిన పార్టీ అని చెప్పారు. ఎంత మంది ఏకమై వేధించినా లెక్కచేయకుండా గట్టిగా నిలబడి కలబడిన నాయకుడు జగన్ పెట్టిన పార్టీ అన్నారు. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదని, వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ కాదని, నమ్మకద్రోహంతో పుట్టిన పార్టీ అసలే కాదని చెప్పారు. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు పెట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని, ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన పార్టీ అని చెప్పారు. ఇలాంటి పార్టీ నాయకులను తప్పుడు కేసులతో బెదిరించాలంటే ఎవరూ భయపడన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను భయాందోళనలకు గురి చేయడానికి కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. క్రియాశీలకంగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి, జైలుకు పంపించి పార్టీని నిర్వీర్యం చేసేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు వచ్చినప్పుడల్లా కేసులే..
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తన మీద కేసులు పెట్టి జైలుకు పంపించడం ఆనవాయితీగా మారిందని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికే తన మీద 72 కేసులు పెట్టారని, ఈసారి తన కుమారుడి మీద కూడా 10 కేసులు బనాయించారన్నారు. పోరాటాలతో పురుడు పోసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పుడు కేసులకు భయపడరని, మరింత రెట్టించిన ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారని చెప్పారు. 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో కలిసి నడుస్తున్నానని, వైఎస్ రాజారెడ్డి, ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి, జననేత జగన్ మోహన్ రెడ్డిలు తనను ఎంతో ఆదరించారని చెప్పారు.
కూటమిలో చాలా మంది అరవ శ్రీధర్‌లు..
కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లు ఉన్నారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు మహిళల వెంటపడుతుంటే, చంద్రబాబు తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే చంద్రబాబుకే ఇవ్వాల్సి వస్తుందని, అసత్య ఆరోపణలు చేయడంలో చంద్రబాబు దిట్టని చెప్పారు.
కల్తీ లడ్డూ అబద్ధమని సీబీఐ, సిట్ చెప్పాయి..
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని కూడా వదిలిపెట్టలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. పవిత్రమైన తిరుపతి లడ్డులో కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వం వేసిన సీబీఐ, సిట్‌లు తేల్చి చెప్పాయన్నారు. కూటమి నాయకుల వద్ద ఏదైనా సాక్ష్యాలుంటే సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంచి రాజధాని ఉండాలని అందరూ కోరుకుంటున్నామని చెప్పారు. ఊహలతో కూడిన రాజధాని కావాలని ఎవరూ అడగడం లేదన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఏ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారో చూపెట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చిన కాలేజీ అడ్రస్ చెప్పాలని, 50 ఏళ్లు దాటిన బీసీలకు ఎంత మందికి పింఛన్లు ఇస్తున్నారో చూపెట్టాలని ప్రశ్నించారు. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వరకు తనకు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన వెనక బలమైన జగన్ అనే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కొండపి ఇన్‌చార్జ్, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు, గిద్దలూరు ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్‌లు వైఎం ప్రసాద్ రెడ్డి, మాదాసి వెంకయ్య, పార్టీ నాయకులు కె.రమణారెడ్డి, బొట్ల రామారావు, వై.వెంకటేశ్వరరావు, బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


