సేవల్లో జీఛీహెచ్..!
మార్కాపురం జీజీహెచ్‌లో కుంటుపడుతున్న వైద్యం వైద్యులు లేక సకాలంలో అందని సేవలు నాడు 75 మంది ఉండగా.. నేడు 15 మందే డాక్టర్లు అత్యవసర వైద్యానికి పరుగులు వైఎస్సార్ సీపీ హయాంలో మెరుగైన వైద్య సేవలు చంద్రబాబు వచ్చాక వైద్యుల బదిలీలు భారీగా పడిపోయిన ఓపీల సంఖ్య నాడు 600 ఉండగా.. నేడు 200
మార్కాపురం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్కాపురం జీజీహెచ్ అంటే రోగుల ప్రాణాలకు భరోసా ఉండేది. జీజీహెచ్‌కి వెళ్తే నమ్మకంగా ఆరోగ్యంగా బయటకు వస్తామన్న ధైర్యం ఉండేది. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు, మంచి మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం నూతన జిల్లాగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉండే సుమారు 8 లక్షల మంది ప్రజలకు వైఎస్సార్ సీపీ హయాంలో జీజీహెచ్ నమ్మకాన్ని కలిగించింది. నల్లమల అటవీ ప్రాంతం ఉండటంతో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వారు సైతం ఎక్కువగా మార్కాపురం జీజీహెచ్‌కి వచ్చి వైద్యసేవలు పొందేవారు.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి
తలకిందులు...
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కాపురం జీజీహెచ్ పరిస్థితి తలకిందులైంది. 75 మంది డాక్టర్లున్న జీజీహెచ్‌లో ప్రసుత్తం 15 మంది మాత్రమే ఉన్నారు. బయట నుంచి చూస్తే బాగానే ఉన్నా.. లోపలికి వెళితే డాక్టర్ల గదులు చాలావరకూ ఖాళీగా కనిపిస్తున్నాయి. 350 బెడ్లు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులు ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారు. జేబులు గుళ్లచేసుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మార్కాపురం వైద్యశాలను జీజీహెచ్‌గా మార్చి 75 మంది డాక్టర్లను నియమించారు. వీరిలో ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, స్పెషలిస్టు వైద్యులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి వైద్యసేవలు పొందారు. కరోనా సమయంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అంతేగాకుండా రాయవరం వద్ద రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 70 శాతానికిపైగా పనులు పూర్తిచేసింది. అందుకు అనుగుణంగా జీజీహెచ్‌లో 350 బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఐసీయూ, వెంటిలేటర్ అత్యాధునిక వైద్య పరికరాలు, రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడంతో ఎంతో మంది ప్రాణాలను మార్కాపురం జీజీహెచ్ కాపాడింది. ఆనాడు రోజుకు 550 నుంచి 600 వరకూ ఓపీ ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు నిలిపివేయడంతో పాటు పీపీపీలో నిర్మిస్తామని చెప్పారు. స్థానిక జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులందరినీ ఒంగోలు, గుంటూరు, ఏలూరు, కర్నూలు.. ఇలా పలు ప్రాంతాలకు బదిలీ చేశారు. గత ఏడాది ఆగస్టు నాటికి 22 మంది వైద్యులు ఉండగా.. ఇటీవల నలుగురు డాక్టర్లకు కాంట్రాక్టు సమయం ముగియడం, మరికొంత మంది బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. వైద్యసేవలు సరిగ్గా అందకపోవడంతో ఓపీ కూడా 150 నుంచి 200కు పడిపోయింది. పలు అత్యాధునిక వైద్య పరికరాలను ఇతర మెడికల్ కాలేజీలు, వైద్యశాలలకు తరలించేశారు. దీంతో అత్యవసర వైద్యసేవలకు ఎవరైనా వస్తే 2019కు ముందులాగా ఒంగోలు లేదా గుంటూరుకు రెఫర్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో వైద్యసేవలకు వచ్చే రోగుల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతోంది. ఇప్పుడున్న డాక్టర్లలో కూడా కొంత మంది మార్చి నెలాఖరుకు బదిలీపై వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అటు మెడికల్ కళాశాల అర్ధంతరంగా ఆగిపోవడం, ఇటు జీజీహెచ్‌లో వైద్య సిబ్బంది తక్కువ కావడంతో మార్కాపురం జిల్లా ప్రజలు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ల ఖాళీలు భర్తీ చేయాలి
మార్కాపురం జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. లేదంటే వైద్యసేవలు తగ్గిపోతాయి. మార్కాపురం జిల్లాలో దోర్నాల, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్ధవీడు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు దోర్నాల – శ్రీశైలం, దోర్నాల – ఆత్మకూరు, అమరావతి – అనంతపురం, దేవరాజుగట్టు – ఒంగోలు జాతీయ రహదారులు ఉన్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో బాధితులు ఎవరైనా జీజీహెచ్‌కి వస్తే పూర్తిస్థాయిలో డాక్టర్లు లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్యులను నియమించాలి. – సోమయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు


