సీబీఐ రిపోర్టుకు విలువ లేదా
లడ్డూలో పందికొవ్వు లేదని రిపోర్టు ఇచ్చినా తప్పుడు ప్రచారం పాలన చేతకాక మహాపాపాలకు ఒడిగడుతున్న చంద్రబాబు వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
ఒంగోలు సిటీ: పరిపాలన చేతకాక ముఖ్యమంత్రి చంద్రబాబు కల్తీ లడ్డూ పేరుతో మహాపాపాలకు ఒడిగడుతున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఒంగోలులోని శ్రీగిరి వెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం ప్రత్యేక పూజల్లో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ప్రభుత్వం అపచారానికి పరిహారంగా వారు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పథకాలిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు చివరకు దేవుడ్ని కూడా మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దేవుడి మీద ఎలాంటి భక్తి లేదని, అందుకే పవిత్రమైన తిరుపతి లడ్డూ మీద కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలపలేదని సీబీఐ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూటమి నాయకులు సిగ్గు ఎగ్గూ లేకుండా కులమతాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ విషయంలో సీబీఐ, ఎన్‌డీపీఎల్ ఇచ్చిన రిపోర్టులన్నిటినీ సాక్షి పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిందని తెలిపారు. ఏ ఆధారాలతో చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవాన్ని ప్రశ్నించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో తీసిన శాంపిల్స్‌ని తీసుకొని పరీక్షలకు పంపించడం వెనక అసలు ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. బోలేబాబాకు అనుమతిచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వమేనన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. మీ హయాంలో పంపించిన నెయ్యి కల్తీ జరిగితే అది మీ పాపమే కదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రభుత్వ పాలనలో తిరుపతిలో కొనుగోలు కమిటీలో ఉన్నవారికి పదవులిచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటున్న చంద్రబాబు వారి మీద ఈగవాలకుండా చూసుకుంటున్నారని, వైఎస్సార్ సీపీ నాయకుల మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోతే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే స్వయంగా తీసేస్తారని స్పష్టం చేశారు.
చంద్రబాబు అబద్ధాలకు దేవదేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి..
ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అబద్ధాలను ఎండగడుతూ దేవదేవుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. పచ్చ పత్రికల్లో రోజూ అబద్ధాల ప్రచారం రాస్తూ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుకు కేంద్ర ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసించడం ఓర్వలేక డైవర్షన్ కోసం ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ్‌కో సహకారంతోనే పట్టణ నడిబొడ్డులో ఫ్లెక్సీలు కట్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులకు తెలియజేశామని, వారు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జరిగే పరిణామాలకు కార్పొరేషన్ కమిషనర్, పోలీసు అధికారులదే బాధ్యతన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు గౌతమ్ అశోక్, వైఎస్సార్‌సీపీ నాయకులు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, చందోలు చెంచిరెడ్డి, పిల్లి రాధాకృష్ణారెడ్డి, ఎదురు మాల్యాద్రిరెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు, గోపిరెడ్డి అశోక్‌రెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


