ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి
● అధికారులకు కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు
ఒంగోలు వన్‌టౌన్:
ఇసుక అక్రమ రవాణా, అనధికార యార్డులపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ చాంబర్‌లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఇసుక స్టాక్ యార్డులలో పరిస్థితి, వినియోగదారులకు ఇసుక రవాణా తీరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాలలో లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యక్తం కావడానికి గల కారణాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక అక్రమ రవాణా, బుకింగ్‌లో అక్రమాలు అరికట్టేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఆ విషయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాహనదారులకు భారీ జరిమానాలు విధించాలని సూచించారు. అనధికార యార్డులను ధ్వంసం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ప్రజల్లో అసంతృప్తి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఇతర అధికారులు, ఇసుక యార్డుల నిర్వాహకులు పాల్గొన్నారు.


