టీడీపీ నాయకుల దౌర్జన్యాలు సహించం
లింగసముద్రం: కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు, దౌర్జన్యాలు సహించేదే లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్‌యాదవ్ హెచ్చరించారు. మండలంలోని పెదపవనిలో జెడ్పీటీసి డాక్టర్ చెన్ను నళినీపద్మకు చెందిన భూమిలో టీడీపీ నాయకులు గ్రావెల్ కోసం తవ్విన గుంతలను పరిశీలించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణా, కోడిపందెం, జూదం, రేషన్ బియ్యం అక్రమ రవాణా, బెల్టు షాపులు మొదలైన వాటిల్లో పర్సంటేజీలు తీసుకుంటూ కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. ఆయనకు పర్సంటేజీలు ఇస్తే చట్టానికి విరుద్ధంగా ఏ పనైనా చేస్తారన్నారు. వైఎస్సార్ నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇలానే కొనసాగితే ఎమ్మెల్యే ఇంటి ముందు లేదా కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ గతంలోనే ఈ భూమిని కొనుగోలు చేశారని, అయితే జెడ్పీటీసీ కావలిలో ఉండటంతో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు 8 అడుగుల మేర గోతులు తీసి రేయింబవళ్లు గ్రావెల్ తరలించి దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఇష్టం వచ్చినట్లు తవ్వకాలు చేస్తూ అడ్డు వచ్చే వారిపై పోలీస్‌స్టేషన్‌లలో ఏదో ఒక కేసు పెట్టించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాచుకో, దోచుకో అంటూ ప్రభుత్వ సొమ్ము దోచుకోవడం అయిపోయి ఇప్పుడు ప్రైవేట్ ఆస్తులను కూడా దోచుకోవడం మొదలుపెట్టారన్నారు. ఇదే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని, తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమన్నారు. అధికారులు కూడా సక్రమంగా పని చేయడంలేదని, అధికారపార్టీ నాయకులు చెప్పిందే చేస్తున్నారని, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏవరైతే అధికారులు తప్పుచేస్తున్నారో వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు.
ఇబ్బందులు పెడుతున్నారు:
జెడ్పీటీసీ నళినీపద్మ
టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెదపవనిలో చెరువులు, కుంటలు, వాగులు, వంకల్లో ఇసుక, గ్రావెల్ ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారని వాపోయారు. ఇప్పుడు మా భూమిలోకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తవ్వేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు వచ్చి జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేయకుండా పంపించివేశారన్నారు. గ్రావెల్ తోలిన వ్యక్తులపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళతామని ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెన్నా క్రిష్ణయ్య, నాయకులు గణేశం గంగిరెడ్డి తోకల కొండయ్య, షేక్ రసూల్, చీమల శ్రీను, వట్టిగుంట వెంకటేశ్వర్లు, మల్లెబోయిన వెంకటేశ్వర్లు, కన్నె రాజారావు గ్రామస్తులు పాల్గొన్నారు.
పెదపవనిలో గ్రావెల్ తవ్విన జెడ్పీటీసీ భూమిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్
ఎమ్మెల్యే ఇంటూరి దందాలపై పోరాటం
అధికారులు పట్టించుకోకుంటే
న్యాయపోరాటం చేస్తాం


