న్యాయం చేయాలని రాస్తారోకో
పొదిలి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కుటుంబ సభ్యులు, బంధువులు రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన శ్రీరామ్ నాగేంద్రబాబు కొనకనమిట్ల మండలం చినారికట్ల–పెదారికట్ల గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువెళ్లే క్రమంలో మృతుని బంధువులు, కుటుంబసభ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ రాజేష్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని సీఐ హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమించారు.


