నేటి నుంచి ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్
ఒంగోలు: ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఈనెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు బ్రేవ్స్ ఫుట్‌బాల్ క్లబ్ నిర్వాహకుడు రాజేంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో జిల్లాలోని సీనియర్, జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రథమ విజేతకు రూ.15 వేలు, ద్వితీయ విజేతకు రూ.10 వేలు, తృతీయ విజేతకు రూ.5 వేలు నగదు బహుమతులతోపాటు కప్ అందిస్తారన్నారు. క్రీడాకారులు సోమవారం ఉదయం 9 గంటలకు నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలని కోరారు.
కలెక్టర్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
ఒంగోలు సబర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ ప్రక్రియను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసినందుకు కలెక్టర్ పీ రాజాబాబుకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డు కలెక్టర్ అందుకున్నారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్‌ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా ప్రకాశం జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని పేర్కొన్నారు.
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న మాదాల శివ రామిరెడ్డి రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఎలెక్టోరల్ ఆఫీసర్‌గా ఆదివారం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ద్వారా అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న సందర్భంగా సబ్ కలెక్టర్ శివరామిరెడ్డిని పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: అన్నీ వర్గాల ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి జి.సత్యనారాయణ చెప్పారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకాశం రీజియన్ ఆధ్వర్యంలో ఒంగోలు బస్ డిపోలో కండక్టర్లు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ...లింగ, ప్రాంతం వివక్షలకు తావులేకుండా ఓటును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు, పీఓ ఓ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్


